- వితంతువులు, ఒంటరి మహిళలకు అలర్ట్.. ఈ పత్రాలు తప్పనిసరి
- దసరా కానుకగా కొత్త పింఛన్లు.. ఎప్పుడు, ఎవరికి అందుతాయంటే?
- సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగింపు.. పింఛన్ల జాబితాపై సర్కార్ కసరత్తు
Telangana : కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఊరటనిచ్చే వార్త వచ్చింది. దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీని కోసం అవసరమైన బడ్జెట్‌ను కూడా ఇప్పటికే కేటాయించడంతో, ఇక మిగిలింది అర్హులను గుర్తించి తుది జాబితా సిద్ధం చేయడమే.
రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల కొత్త పింఛన్లను (Telangana new pensions) మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అర్హుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో, వీరిలో నిజంగా అర్హత ఉన్నవారిని ఎంపిక చేయడం ప్రభుత్వానికి ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనతో అర్హుల గుర్తింపు
దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి, వారి ఆర్థిక పరిస్థితి, ఆదాయ (Telangana) వనరులు, ఇతర ఆధారాలను అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం వచ్చే నెల మొదటి వారంలో అర్హుల తుది జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాతే పింఛన్ల పంపిణీ మొదలవుతుంది.
అయితే ఈ ప్రక్రియలో కొంత జాప్యం కూడా చోటుచేసుకుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో ఆలస్యం, అలాగే కొన్ని వర్గాలకు సర్టిఫికెట్ల జారీలో ఎదురైన సమస్యల కారణంగా షెడ్యూల్ కొంత వెనక్కి జరిగింది. దీంతో ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులకు ఇది చివరి అవకాశంగా భావించవచ్చు.
ప్రత్యేక వర్గాలకు ధ్రువీకరణ పత్రాల నిబంధనలు
దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా బాధితులు, చేనేత, గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళల విషయంలో అర్హత నిర్ధారణకు ప్రత్యేక పత్రాలు తప్పనిసరి చేశారు. ఒంటరి మహిళలు తమ దరఖాస్తుతో పాటు విడాకుల పత్రాలు, కోర్టు ఉత్తర్వులు సమర్పించాలి.
అలాగే గత ఏడాది కాలంగా ఒంటరిగా జీవిస్తున్నట్టు ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువుల విషయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం అవసరం కాగా, భర్త చనిపోయి చాలా కాలం అయిన సందర్భాల్లో ఈ సర్టిఫికెట్ పొందడంలో కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇక గీత, చేనేత, ఫైలేరియా, డయాలసిస్ వర్గాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందడంలోనూ ఆలస్యం జరుగుతోంది. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని, ధ్రువీకరణ పత్రాలు లేకుండానే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే తుది అర్హత నిర్ధారణ సమయంలో మాత్రం ఈ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు దరఖాస్తుదారుడికి పింఛన్ మంజూరవుతుంది.
ప్రస్తుతానికి 2.50 లక్షల పింఛన్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున, పూర్తి అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన వెంటనే తుది జాబితాను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపుతారు.
దసరా నుంచి కొత్త పింఛన్లు అందనున్న నేపథ్యంలో అర్హులైన వేలాది కుటుంబాలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎదురుచూసిన వారికి ఈ దసరా పండుగ ప్రత్యేకమైనదిగా మారనుంది.















