- 12 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఖైరతాబాద్ చుట్టూ డైవర్షన్లు ఇవే
- బడా గణపతి దర్శనానికి పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు.. పార్కింగ్ ఎక్కడంటే?
- ఖైరతాబాద్‌లో వాహనాలకు నో ఎంట్రీ.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవిగో
- మెట్రో, బస్సు వాడితేనే మేలు.. గణేష్ దర్శనానికి పోలీసుల సూచన
Khairatabad Ganesh Darshan : ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనం మొదలైన నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ నిబంధనలు కొనసాగనున్నందున, ఆ మార్గంలో ప్రయాణించే వారు ముందుగానే ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవడం మేలు.
ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పలు జంక్షన్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చేవారిని నిరంకారి జంక్షన్ దిశగా పంపుతుండగా, పాత పీఎస్ సైఫాబాద్ నుంచి వచ్చే వాహనదారులను రాజ్‌దూత్ లైన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తున్నారు.
Read Also : New Traffic Rules: అన్ని డాక్యుమెంట్లు ఉన్నా రెండు వేల ఫైన్, ఎందుకంటే?
ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ దిశగా వెళ్లే వాహనాలు మింట్ కాంపౌండ్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్‌రోడ్ వైపు మళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చేవారు సెక్రటేరియట్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేటు వైపు వెళ్లే వాహనాలను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ దిశగా మళ్లిస్తారు.
పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు
దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం పోలీసులు వేర్వేరు చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చేవారు రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ స్థలంలో వాహనాలు నిలపవచ్చు. ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా పార్కింగ్ కోసం వినియోగించుకోవచ్చు. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చేవారు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్క్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9010203626 నంబర్‌లో సంప్రదించవచ్చు.
భక్తులకు పోలీసుల విజ్ఞప్తి
సొంత వాహనాల బదులు బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా సాధనాలు వాడితే రద్దీ గణనీయంగా తగ్గుతుందని పోలీసులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.















