- CCTV, AI నిఘాతో మద్యం షాపులపై కంట్రోల్.. తప్పితే భారీ జరిమానా
- రెన్యువల్ చేసుకోని షాపులకు లాటరీ.. కొత్త ఎక్సైజ్ పాలసీ వివరాలు
- MRP ఉల్లంఘిస్తే రూ.10 లక్షల ఫైన్.. కొత్త లిక్కర్ నిబంధనలు ఇవే
- అక్రమ మద్యంపై సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు.. ఏపీ సర్కార్ నిర్ణయం
AP New Excise Policy : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీని ఖరారు చేస్తూ, ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం షాపుల లైసెన్సులను మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం కల్పించింది. ఇదే సమయంలో మద్యం విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన నిబంధనలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం షాపుల సంఖ్యలో ఎలాంటి మార్పు లేకుండా, వాటి యజమానులకే లైసెన్సులు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. వీటిలో 3,396 షాపులు ఓపెన్ కేటగిరీ కిందకు రాగా, మిగిలిన 340 షాపులు గీత కులాలకు కేటాయించారు. కొత్త పాలసీ 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. రెన్యువల్ కోసం వార్షిక రుసుముతో పాటు అదనంగా 38 శాతం రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రెన్యువల్ చేసుకోకపోతే లాటరీ పద్ధతి
ఒకవేళ ప్రస్తుత లైసెన్సుదారులు రెన్యువల్‌కు ముందుకు రాకపోతే, ఆ షాపులను లాటరీ విధానంలో కొత్తవారికి (AP New Excise Policy) కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తి రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. అయితే ఒక్కో షాపుకు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ దరఖాస్తులు వస్తే చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.
ఇక MRP నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించనుంది. డ్యూటీ చెల్లించని మద్యం విక్రయం, స్పిరియస్ లిక్కర్, బ్రాండ్ మిక్సింగ్, డైల్యూషన్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో పొరపాట్లకు పాల్పడితే మొదటిసారే రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. అదే తప్పు రెండోసారి పునరావృతమైతే లైసెన్స్ రద్దుతో పాటు, భవిష్యత్తులో మళ్లీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కోల్పోతారు.
షాపులపై సాంకేతిక నిఘా, డిజిటల్ ట్రాకింగ్
ఇకపై ప్రతి మద్యం షాపులో నాలుగు సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. కౌంటర్, స్టాక్ ఏరియా, కస్టమర్ జోన్, పర్మిట్ రూమ్‌ను ఈ కెమెరాలు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇవి 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ పనిచేయాలి. ఈ ఫీడ్‌ను AI టెక్నాలజీ ద్వారా విశ్లేషించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తారు.
దీంతోపాటు ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయం వరకు మొత్తం సరఫరా వ్యవస్థను డిజిటల్ ట్రాక్ అండ్ ట్రేస్ పరిధిలోకి తీసుకొస్తారు. స్టాక్ ఎంత వచ్చింది, ఎంత అమ్ముడైంది, ఎంత మిగిలింది అనే వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదవుతాయి.
CCTV ఫుటేజీలు, ట్రాన్సాక్షన్ రికార్డులు, స్టాక్ డేటా, వినియోగదారుల ఫిర్యాదులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి AI కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తారు. ఏదైనా ఉల్లంఘన గుర్తిస్తే వెంటనే అలర్ట్ జారీ చేసి, ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాలను పంపే ఏర్పాటు చేశారు.
వినియోగదారుల సౌకర్యం కోసం ప్రతి షాపు ముందు అన్ని బ్రాండ్ల MRPలను ప్రముఖంగా ప్రదర్శించాలని, ఫిర్యాదుల కోసం 14405 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోళ్ల సమయంలో నగదుతో పాటు డిజిటల్ చెల్లింపులను కూడా తప్పనిసరిగా స్వీకరించాలని స్పష్టం చేశారు.
అనధికార మద్యం విక్రయాలపైనా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అక్రమంగా మద్యం అమ్మితే మొదటిసారి రూ.5 లక్షల జరిమానా, రెండోసారి లైసెన్స్ రద్దు తప్పదు. కల్తీ మద్యం, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై సమాచారం ఇచ్చి సీజ్‌కు దారితీస్తే గరిష్ఠంగా రూ.లక్ష వరకు రివార్డు ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. మొత్తంగా చూస్తే, లైసెన్సుదారులకు కొనసాగింపు అవకాశం ఇస్తూనే, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించింది.















