AP Nethanna Scheme : చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ ఇంకా ఆర్థిక సాయం అందని వారికి త్వరలోనే డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, పరిశీలన పూర్తయిన తర్వాత వారం రోజుల్లోగా రూ.25,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సవిత తెలిపారు.
చేనేత కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే అర్హత ఉన్నప్పటికీ కొందరికి నగదు అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి భరోసా ఇచ్చింది.
అర్హులకు మరోసారి అవకాశం.. వారం రోజుల్లో డబ్బులు
సచివాలయంలో ‘నేతన్న సేవలో’ పథకం అమలుపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత ఉన్నప్పటికీ కొందరి ఖాతాల్లో నగదు జమ కాలేదనే అంశంపై చర్చించారు. అర్హులైన వారిని మరోసారి గుర్తించి, వారి దరఖాస్తులను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పరిశీలన పూర్తైన తర్వాత అర్హత ఉన్న వారికి వారం రోజుల్లోగా రూ.25,000 చొప్పున జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 71,536 మంది లబ్ధిదారులకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. మరోవైపు ఈ పథకం కోసం 13,678 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత నిర్ధారణ అనంతరం సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
AP Nethanna Scheme : 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పింఛన్
చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 85,678 మంది చేనేత కార్మికులు పింఛన్ పొందుతున్నట్లు వెల్లడించారు.
అలాగే 62,541 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. చేనేత రంగానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏడాదికి రూ.25,000 సాయం అందించే పథకానికి ఏపీ కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
‘నేతన్న సేవలో’ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే అర్హులు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. అక్కడ అందించే దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జతచేసి సచివాలయ అధికారులకు సమర్పించాలి. అధికారులు దరఖాస్తును పరిశీలించిన అనంతరం అర్హత ఉంటే సంబంధిత వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తారు.
Read Also : AP Telangana Rain Alert : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలకు హెచ్చరిక
అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చి, ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ.25,000 అందని చేనేత కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులను మరోసారి పరిశీలించి అర్హులందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు.













