...

Chandrababu : చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. అటు ఓటములు, ఇటు అవమానాలు

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తల పండిన నేత. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నేతకు ఇప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం దగ్గరి నుంచి చంద్రబాబుకు అన్ని ఇబ్బందులే. ఇక ఈ నెల రోజుల నుంచి ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయనే చెప్పుకోవాలి.

టీడీపీ నేత అయిన పట్టాభిరాం వైసీపీ నాయకుల మీద చేసిన ఆరోపణలతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురై టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని నాశనం చేశారు. ఈ ఘటన మీద అప్పట్లో పెద్ద దుమారే రేగింది. దీనికి నిరసనగా చంద్ర బాబు రాష్ర్ట బంద్ కు పిలుపునిచ్చారు. అనంతరం 36 గంటల దీక్షకు కూడా కూర్చున్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారు. రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కోరారు. వైసీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంలో ఆయన దేశ ప్రధాని మోదీ, బీజేపీలో నంబర్ 2 గా ఉన్న అమిత్ షాను కలవడం కోసం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇది బాబుకి పెద్ద అవమానం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

ఇక ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాబుకు పెద్ద షాక్ తగిలింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇలా జరగడం చంద్రబాబు రాజకీయ జీవితానికే పెద్ద మచ్చ అనుకుంటున్న తరుణంలో అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు ఆయన్ను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు బోరున విలపించారు.
Read Also : AP Three Capitals : మోదీ లాగే జగన్ కూడా దిగిరాక తప్పదా?