CM KCR : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ మొన్నటివరకు ఉన్న తన పంథాను మార్చుకున్నారు. మౌనం వీడారు. ప్రతిపక్షాలపై విరుచుకపడుతున్నారు. ఫాంహౌస్ సీఎం అనేవారికి చుక్కలు చూపిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిలో చాలా మార్పు వచ్చింది. ప్రతిపక్షాలకు టార్గెట్ అవ్వకుండా తమ రాజకీయ చతురతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో కొంత మేర సక్సెస్ అయ్యారని కూడా తెలుస్తోంది. రాహుల్ గాంధీ మీటింగ్‌కు టీఆర్ఎస్ ఎంపీలు అటెండ్ అవ్వడం లోకల్ కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. మరోవైపు కేంద్రాన్ని, పార్లమెంటులో ధాన్యం కొనుగోలు చేయాలని ఎంపీలు నిరసన చేయడం వలన రైతులకు నేనున్నానంటూ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ మరోసారి జనంలోకి వెళ్లేందుకు పథక రచన చేసినట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014 ఎన్నికల్లో ఉద్యమ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యారు. మరల 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి సంక్షేమ పథకాల పేరుతో ప్రజల మనస్సును, అభిమానాన్ని చూరగొని బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇదే వ్యూహం పాటిస్తారా? అంటే లేదని తెలుస్తోంది. తొలుత ప్రతిపక్షాలకు అంతుచిక్కుకుండా ప్రణాళికలు రచించి మరోసారి భారీ సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వారిని మెప్పించి ఎన్నికల్లోకి వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లపై జనాలకు నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట..
కేంద్రంలో మోడీ సర్కారుపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ముందుగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట..కేంద్ర అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బాగా ప్రచారం చేసి బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయేలా చేసేందుకు కేసీఆర్ జనంలోకి వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది. దళిత బంధు లాంటి పథకాలను మరిన్ని తీసుకువచ్చి ముందస్తు ఎన్నికల బరిలో నిలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని కూడా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ఈ నెల 19 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వనపర్తి జిల్లాతో మొదలై జనగామ, నాగర్‌కర్నూలు, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్‌లో పర్యటించనున్నారు.
Read Also : CM KCR : గులాబీ అధినాయకుడికి గుబులు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world