Gold Price 2026 : బంగారం ధరలు భగ్గమంటున్నాయి. రోజురోజుకీ బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. బంగారం చాలదన్నట్టు ఇప్పుడు వెండి కూడా పరుగులు పెడుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా వేగంగా దూసుకుపోతున్నాయి.
గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుదల ధోరణిని కొనసాగించాయి. జనవరి 21వ తేదీ బుధవారం నాడు, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 7,774 లేదా 5.16శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,58,339కి చేరుకుంది.
Gold Price 2026 : మూడు రోజుల్లో రూ. 15,822 పెరిగిన బంగారం :
గత మంగళవారం కూడా బంగారం రికార్డును బద్దలు కొట్టి, ఫ్యూచర్స్ ట్రేడ్‌లో 10 గ్రాములకు రూ. 1.5 లక్షల మార్కును దాటింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధరలు మొత్తం రూ. 15,822 లేదా 11.10శాతంగా పెరిగాయి.
జనవరి 16న, బంగారం 10 గ్రాములకు రూ. 1,42,517 వద్ద ఉంది. ఇప్పుడు ఆ స్థాయి బాగా పెరిగింది. ఏప్రిల్ నెల గడువు ముగిసే సమయానికి బంగారం ఫ్యూచర్స్ కూడా బలమైన ర్యాలీని చూసింది. రూ. 8,869 లేదా 5.63శాతం పెరిగి, 10 గ్రాములకు జీవితకాల గరిష్ట స్థాయి రూ. 1,66,425కి చేరుకుంది.
వరుసగా 3వ రోజు కూడా రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధరలు :
బంగారంతో పాటు వెండి కూడా భారీగా పెరుగుతూ పోతోంది. మార్చి డెలివరీకి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ ధర రూ. 11,849 లేదా 3.66శాతం పెరిగి MCXలో కిలోగ్రాముకు రూ. 3,35,521 కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. వెండి కొత్త గరిష్టాన్ని నమోదు చేయడం ఇది వరుసగా మూడవ రోజు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి కూడా దగదగమెరుస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మొదటిసారిగా ఔన్సుకు 4,800 డాలర్ల మార్కును దాటింది. ఫిబ్రవరి డెలివరీకి బంగారం ధర ఔన్సుకు 113.4 డాలర్లు లేదా 2.4శాతం పెరిగి 4,880.9 డాలర్లకి చేరుకుంది. ఇంతలో, మార్చి కాంట్రాక్టుకు సంబంధించిన కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.17శాతం పెరిగి ఔన్సుకు 94.79 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మునుపటి సెషన్‌లో రికార్డు స్థాయిలో ఔన్సుకు 95.53 డాలర్లకు చేరుకున్నాయి.

బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలేంటి? :
ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరుగుతున్న వేళ వాణిజ్య యుద్ధాల భయం పెట్టుబడిదారులను వెనక్కి లాగుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో పెట్టుబడిదారులు ఎక్కువగా సురక్షితమైన ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం, వెండికి డిమాండ్ బాగా పెరుగుతోంది.
గ్రీన్‌ల్యాండ్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలు, అనిశ్చితి పెరుగుతుండగా 8 యూరోపియన్ దేశాలపై కొత్త సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు.
అదనంగా, అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు ట్రంప్ సుంకాల చెల్లుబాటుపై తీర్పును వాయిదా వేసింది. ఈ సుంకాలను త్వరగా రద్దు చేయాలనే పెట్టుబడిదారుల ఆశలను దెబ్బతీసింది. ఫలితంగా బులియన్ మార్కెట్లో గందరగోళాన్ని మరింత పెంచింది.
Gold Price 2026 : బలహీనపడిన రూపాయి కూడా పెద్ద కారణామే :
ఇంట్రాడేలో డాలర్‌తో పోలిస్తే.. భారతీయ కరెన్సీ రూపాయి వాల్యూ 61 పైసలు తగ్గి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 91.58కి చేరుకుంది. విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు జరపడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల బంగారం దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలపై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి.
బంగారంపై నిపుణులు ఏమన్నారంటే? :
బంగారం రోజురోజుకు పెరిగిపోతూనే ఉందని భవిష్యత్తులో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు దాదాపు రూ. 7,000 పెరిగి రూ. 1.58 లక్షలకు చేరుకున్నాయి. ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం 3 సెషన్లలో బంగారం రూ. 15వేల కన్నా ఎక్కువ లాభపడింది. జనవరి 2026లో ఇప్పటివరకు దాదాపు 15శాతం పెరిగింది.
అమెరికా, గ్రీన్‌ల్యాండ్, యూరప్, రష్యా-ఉక్రెయిన్ వంటి మల్టీ రంగాలలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్‌ను మరింత పెంచాయని అంటున్నారు. అనిశ్చితి, డాలర్ హెచ్చుతగ్గుల ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు ఎక్కువగా బులియన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
















