CM KCR : తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కానీ, ఇంతకు ముందర జరిగిన ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది. దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతోంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార గులాబీ పార్టీపైన వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోని జనం మధ్యే ఉండాలని, జనం కోసం పని చేయాలని సీఎం ఆదేశించినట్లు వినికిడి. ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు రావాల్సిన పని లేదని, అత్యవసరమైతేనే రావాలని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకుగాను సీఎం కేసీఆర్ నిఘా కూడా పెట్టారని వినికిడి. మొత్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు రెండేళ్ల ముందరే ప్రణాళికలను రచించుకుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ రెండేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నిఘా ద్వారా వచ్చే సమాచారం ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయనే వాదన కూడా ఉంది. మొత్తంగా పింక్ పార్టీపైన ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినట్లుగా ఉంది. ఈ విషయమై పార్టీ నాయకులందరికీ ఆదేశాలు అందినట్లు సమాచారం.
Read Also : Pushpa Movie Review : తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..?