Bankipur Bypoll Result : బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్య విజయం చోటుచేసుకుంది. సోమవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. కాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి వరుసగా రెండవ, మూడవ స్థానాలకే పరిమితమయ్యారు. ఈ ఘన విజయంపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
సీఎంపై ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ :
బంకిపూర్ ఉప ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మీడియా (Bankipur Bypoll Result) ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని లక్ష్యంగా మాటలతో దాడిచేశారు. “సీఎం సమ్రాట్ చౌదరితో నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు.
సీఎం వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే. బీహార్ అభివృద్ధి చెందాలంటే, సమర్థుడైన వ్యక్తిని సీఎం చేయండి. ఇది బంకిపూర్ ప్రజల విజయం. ఈ ఎన్నిక ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం కాదు. బీహార్ ప్రజలు బీజేపీ అగ్ర నాయకత్వానికి ఒక సందేశం పంపారు. బీహార్ ప్రజలు మంచి వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటున్నారు” అని తెలిపారు.
Read Also : PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. “తప్పుడు వ్యక్తి సీఎం కాకూడదని బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు. బీహార్‌లో విద్య, ఉపాధి ఉండాలి. ప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం రాకూడదు. బీహార్ ప్రజలు కేవలం కూలీలుగా పనిచేసేందుకు పుట్టలేదు. బీజేపీ బీహార్‌లో మంచి వ్యక్తులను మంత్రులుగా చేయాలి. బీహార్ ప్రజలు సీఎం సమ్రాట్ చౌదరి నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. 30 ఏళ్ల నాటి కోట కూలిపోవడానికి 30 రోజులు కూడా పట్టలేదు. బీజేపీ వైఖరి కారణంగానే బీహార్ మరొకరికి నాయకత్వం’’ అప్పగించిందన్నారు.
మీరేం చేస్తారంటే? :
బంకిపూర్‌లో గెలిచాక ఫస్ట్ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేస్తారని మీడియా అడగ్గా, ప్రశాంత్ కిషోర్ ఒకటే సమాధానం చెప్పారు.. “బంకిపూర్‌ను అభివృద్ధి చేసేందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను. కొన్ని నెలల్లోనే మీరు అభివృద్ధిని చూస్తారు. నేను బంకిపూర్‌ను బెంగళూరులా మార్చను. కానీ, మీరు అభివృద్ధిని మాత్రం చూడగలరు. నాకు ఓటు వేయని వారి నమ్మకాన్ని కూడా గెలిచేందుకు ప్రయత్నిస్తాను.” అంటూ చెప్పారు.
బీజేపీకి తీరని ఎదురుదెబ్బ :
బీహార్‌లోని బంకిపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం బీజేపీకి తీరని ఎదురుదెబ్బను మిగిల్చింది. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియోజకవర్గం. ఆయన రాజ్యసభకు రాజీనామా చేశాక ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. ఈ సీటు కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. అయితే, ఎన్నికల ఫలితాలు బీజేపీకి కలిసిరాలేదు. మరోవైపు, బీహార్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ మూడో స్థానానికి పడిపోయింది.













