- హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం?
- పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు.. ప్రజలకు అధికారుల హెచ్చరిక
- మూడు రోజులుగా వర్షాలతో ఊరట.. రైతులకు కాస్త రిలీఫ్
- తెలంగాణలోని ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు.. పూర్తి వివరాలు
Heavy Rain Alert : చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలకు ఊరట లభించింది. అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తుండగా, పలు ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దీంతో సాగు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు కొంత ఉపశమనం కలిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి రెండు రాష్ట్రాలకు వర్ష సూచనలు జారీ చేసింది.
మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని కూడా హెచ్చరించారు.
ఏపీలో ఏయే జిల్లాలకు ప్రభావం
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చు. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Read Also : Bus Ticket Prices : ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్.. పండుగ స్పెషల్ బస్సుల్లో 50శాతం ఛార్జీలు పెంపు..
తెలంగాణపై కూడా ఇదే అల్పపీడనం ప్రభావం చూపుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మెదక్, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, రాబోయే గంటల్లో ఉరుములతో కూడిన మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. యాదాద్రి-భువనగిరి, జనగాం, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు కూడా రాబోయే మూడు గంటల్లో వర్షాలు విస్తరించే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో వర్షం
నగరంలో రాజేంద్రనగర్, మణికొండ, అత్తాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, నాంపల్లి, బేగంపేట్, జూబ్లీహిల్స్, గోల్కొండ, టోలిచౌకి, కాప్రా, అల్వాల్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఘట్‌కేసర్, కీసర, బోడుప్పల్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక పటాన్‌చెరు, లింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, గాజులరామారం వంటి ఉత్తర, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలు నివారించి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.













