- బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
- గంటకు 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరిక
- ఏపీ, తెలంగాణలో వర్ష బీభత్సం.. ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం?
- అల్పపీడనం బలపడింది.. మూడు రోజుల పాటు వర్ష సూచన జారీ
Heavy Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కొన్నిచోట్ల పిడుగులు, భారీ ఈదురు గాలులు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, అలాగే దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం అదే స్థానంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైరుతి దిశగా వాలుతూ కదులుతోందని వాతావరణ నిపుణులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఈ వ్యవస్థ మరింత బలం పుంజుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తీర జిల్లాల్లో తీవ్ర హెచ్చరిక
ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై పడనుంది. ఇక్కడ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also : Actress Hema : బావగారు చిరంజీవి, బాయ్‌ఫ్రెండ్‌లా నాగార్జున.. హేమ సంచలన కామెంట్స్

కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగనుంది, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రభావమంటే?
తెలంగాణలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కొనసాగవచ్చు. వీటితో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రైతులు, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, ఉరుములు మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.











