- జనసేనలో నాలుగో మంత్రి ఎవరంటే..
- నాగబాబు వర్సెస్ ఉత్తరాంధ్ర
- నాలుగో మంత్రి పదవి నాగబాబుకే దక్కుతుందా
AP Cabinet Expansion : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో జనసేనకు మరో మంత్రి పదవి దక్కనుందా? ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆ పార్టీకి కేబినెట్ విస్తరణలో నాలుగో బెర్త్ ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే ఆ మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది? ఇప్పటికే హామీ పొందిన నాగబాబుకే అవకాశం వస్తుందా? లేక పార్టీని ఉత్తరాంధ్రలో మరింత బలోపేతం చేయాలనే వ్యూహంలో భాగంగా అక్కడి నేతకు అవకాశం ఇస్తారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కూటమి ప్రభుత్వంలో రెండో అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న జనసేన.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచిన జనసేనకు ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యత లభించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఐదు కీలక శాఖలు దక్కాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమైన పౌర సరఫరాల శాఖను కేటాయించారు. కందుల దుర్గేష్‌కు పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ ఇద్దరు జనసేన మంత్రులు కూడా తమకు అప్పగించిన శాఖల్లో సమర్థంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.
కేబినెట్ విస్తరణలో జనసేనకు మరో బెర్త్?
జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామన్న హామీ గతంలోనే ఉందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా నాగబాబుకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడంతో, ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గత ఏడాది ట్వీట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా జనసేనకు మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న ముగ్గురితో కలిపి జనసేన నుంచి కేబినెట్‌లో నలుగురు మంత్రులు ఉంటారు.
అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్నదే. నాగబాబుకు ఇప్పటికే హామీ ఉన్న నేపథ్యంలో ఆయనకే ఈ అవకాశం ఇవ్వాలా? లేక పార్టీ భవిష్యత్ రాజకీయ విస్తరణను దృష్టిలో పెట్టుకుని మరో నేతను ఎంపిక చేయాలా? అనే అంశంపై జనసేనలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
నాగబాబుకే మంత్రి పదవి వస్తుందా?
పార్టీలోని ప్రస్తుత సమీకరణాలను పరిశీలిస్తే హామీ ప్రకారం నాగబాబుకు మంత్రి పదవి దక్కాల్సి ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. గత ఏడాది మార్చి 30న ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన చట్టసభ సభ్యుడిగా ఉన్నందున మంత్రి పదవి చేపట్టేందుకు అర్హత కూడా ఉంది.
అయితే నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంత్రులుగా ఉన్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జనసేనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సోదరుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షాల నుంచి, ఇతర రాజకీయ వర్గాల నుంచి కుటుంబ రాజకీయాలపై విమర్శలు రావచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు జనసేనలో సామాజిక వర్గ సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారిగా ఉన్నారు. మూడో మంత్రి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే పార్టీపై మరో రకమైన విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ ఉంది.
Read Also : AP EAMCET 2026 : ఎంసెట్‌లో సీటు వచ్చిందా? ఆగస్టు 15లోగా ఈ 2 పనులు చేయాలి.. లేదంటే సీటు పోయినట్టే!
ఈ కారణాలతోనే జనసేన అధిష్ఠానం ఇతర నేతల పేర్లను కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీని ఉత్తరాంధ్రలో మరింత విస్తరించాలనే వ్యూహం ఉంటే.. ఆ ప్రాంతానికి చెందిన నాయకుడికి నాలుగో మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాజకీయంగా బలమైన సంకేతం ఇవ్వవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
అంటే నాగబాబుకు ఇచ్చిన హామీ ఒకవైపు ఉండగా.. పార్టీ విస్తరణ, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణాలు మరోవైపు జనసేన నిర్ణయంలో కీలకంగా మారే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? నాలుగో మంత్రి పదవి నాగబాబుకే దక్కుతుందా? లేక ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త నేతను ఎంపిక చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













