AP New Districts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం యోచన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉగాది లోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారట. దీంతో కొత్త జిల్లాలను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం అందుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది.
అయితే కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది. దీనితో కొత్త జిల్లాల ఏర్పాటుపై జాప్యం ఏర్పడింది. ఏపీలో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడుగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. అరకు 2 జిల్లాలు , అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయని సమాచారం.

కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవిన్యూ శాఖ తొలుత ప్రాధమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత దానిపై సూచనలు, సలహాల కోసం 30 రోజులు గడువు ఇవ్వనుండగా.. వాటిన్నంటినీ పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు అమలులోకి వచ్చే అఫీషియల్ డేట్ ఉంటుంది.
Read Also : కరోనాను ఓడించాలంటే ఈ జాగ్రత్తలే మీకు రక్ష!