RRR Movie Ticket Rates : దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పాన్ ఇండియా RRR మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మల్టీ స్టారర్ మూవీగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ మూవీని శిల్పంలా చెక్కారు జక్కన్న.. మెగా ఫ్యాన్స్.. నందమూరి అభిమానులైతే ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా ఆశలు పెట్టేసుకున్నారు.
మార్చి 25న (RRR Movie Release) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో RRR రిలీజ్ ముందుగానే ఏపీలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు కొత్త జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ఏపీలో RRR మూవీ ఆడే అన్ని థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజత్ జీవోను విడుదల చేశారు.
RRR మూవీ రిలీజ్ అయిన మార్చి 25 నుంచి పది రోజుల పాటు సినిమా టికెట్లపై ప్రత్యేక ధరలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. RRR టిక్కెట్ ధరలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. జీఎస్టీతో సంబంధం లేకుండా ఈ సినిమా ఖర్చును రూ. 336 కోట్లుగా నిర్మాతలు వెల్లడించారు. అయితే హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌తో కలిపి రూ. 478 కోట్లుగా వెల్లడించింది చిత్రయూనిట్.
ప్రస్తుతం ఏపీలో మల్టీఫ్లేక్సుల్లో హైయిస్ట్ టికెట్ రేటు రూ.250గా ఉంది. తాజాగా పెంచిన రూ.75తో కలిపి మొత్తం రూ. 325 రూపాయల వరకూ టికెట్ ధర పెంచుకోనే అవకాశం ఉంటుంది. ఇటీవలే RRR మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. RRR మూవీ నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు ఉండనుంది.
RRR సినిమా ధరల పెంపు విషయంపై దరఖాస్తు వచ్చిందని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. టిక్కెట్ రేట్లపై జీవో జారీకి ముందే ఈ సినిమాను నిర్మించడంతో రాష్ట్రంలో 20శాతం షూటింగ్ నిబంధన వర్తించదని మంత్రి పేర్ని నాని చెప్పారు. కొత్తగా నిర్మించే సినిమాలకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు.
Read Also : RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన జీ 5… ఎన్ని కోట్లంటే?