...

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి కోసం కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం చాలామందికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఇంకా ఇ-కేవైసీ చేసుకోని వారే ఎక్కువమంది ఉన్నారు. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసినవారికి మాత్రమే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరోసారి అవకాశం ఇస్తూ గడువును ప్రభుత్వం పొడిగించింది. గడువు తేదీ ముగిసేలోపు రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఇ-కేవైసీ చేయించుకోవాలని సూచించింది. ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేయించుకోవాలని సూచించింది.

జనవరి 31తో ముగియనున్న గడువు.. మరోసారి పొడిగింపు? :
రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఈ నెల 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. రేషన్‌కార్డుదారుల కోసం ఇ-కేవైసీ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజులు గడువును పొడిగించినట్టు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువును పెంచనున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ రేషన్ కార్డుల కోసం ఇ-కేవైసీ చేయించుకోనివారు వెంటనే వెళ్లి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Telangana Ration Cards : బోగస్ రేషన్ కార్డుల ఎరివేత :

తెలంగాణలో బోగస్‌ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. చాలామంది రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటుకు వలసలు వెళ్లడం, మరణించిన వారి కుటుంబసభ్యుల పేర్లు ఇంకా రేషన్ కార్డుల్లో ఉండటం, నిత్యావసర సరుకులను దారి మళ్లించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే రేషన్‌ కార్డులు అప్‌డేట్ చేసుకోవాలని పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. ఇందులో భాగంగానే ఇ-కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. గడువు తేదీ దగ్గర పడటంతో రేషన్ కార్డుదారులు ఆన్‌లైన్ ద్వారా ఇ-కేవైసీ చేయించుకునేందుకు రేషన్ షాపులదగ్గర క్యూ కడుతున్నారు.

Telangana-ration-card-holders
Telangana-ration-card-holders

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రేషన్‌ కార్డుల ఇ-కేవైసీ ప్రక్రియ 75.76 శాతం మాత్రమే పూర్తి అయింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేసేదిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు తమ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

అప్పుడే వారి పేర్లను రేషన్ కార్డుల్లో ఉంచుతారు. లేదంటే వెంటనే తొలగించడం జరుగుతుంది. అందుకే ఇ-కేవైసీ కోసం రేషన్ షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. చాలా చోట్ల అప్‌డేట్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!