...

CM Jagan : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీలో హాట్ టాపిక్‌గా పోలవరం, అమరావతి ఇష్యూ..?

CM Jagan : కొత్త సంవత్సరంలో సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులపై ప్రధాని మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, అమరావతి రాజధాని, పోలవరం, ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం నిధుల విడుదల గురించి జగన్ మోడీ వద్ద ప్రస్తావించనున్నారని ఏపీ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

కానీ సీఎం జగన్ గతంలో మోడీని కలిసిన ప్రతీసారి ఇదే అంశాలను వైసీపీ నేతలు హైలైట్ చేశారని, నేటి వరకు అభివృద్ధి నిధుల విడుదలపై పురోగతి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి మీటింగ్‌లో ఏం చర్చించారనే విషయాలను బహిరంగంగా ప్రకటించరనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏపీని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.

అందులో ప్రధానమైనది ఆర్థిక సమస్య. ఆర్బీఐ నుంచి తీసుకునే బాండ్ల అప్పుల కోసం కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అది రాకపోతే మంగళవారం రిజర్వు బ్యాంకు వేసే బాండ్ల వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్లు అందించడం చాలా కష్టం. అంతేకాకుండా వైఎస్ వివేకా హత్యపై సీబీఐ దూకుడుగా ఉంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడా తమ పార్టీ నేతలకు చిక్కుకుంటుందేమో అని జగన్ భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలాఉండగా వైసీపీ నేతలు ఏకంగా సీబీఐ పైనే ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ సమావేశంలో జగన్ పోలవరం నిధుల అంశం, విభజన హామీలు, స్పెషల్ స్టేటస్ గురించి ప్రధానితో చర్చిస్తారా? లేదా వ్యక్తిగత విషయాలపై చర్చించనున్నారా? అనే అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి మీటింగ్ అనంతరం ఏపీ ప్రభుత్వం విడుదల చేసే ప్రెస్‌నోట్ ఆసక్తికరంగా మారనుంది.

Read Also :  Chiranjeevi : చిరంజీవి వ‌ల్లే నా సినీ కెరీర్‌కు బ్రేక్ ప‌డింది.. సీనియ‌ర్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు