AP CM Jagan Reddy : ఏపీ రాష్ట్ర ప్రజలే నాకు దేవుళ్లు. వాళ్ల దీవెనలతోనే నేను ఈ స్థాయికి వచ్చానని సీఎం జగన్ అన్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకు పడ్డారు. దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనలు తనకు ఉన్నంత కాలం వాళ్లు ఎవరూ నా వెంట్రుక కూడ పీకలేరని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో విపక్షాలకు కడుపు మంట, అసూయ పెరిగిందన్నారు. అలాంటి అసూయకు మందే లేదన్నారు. అదే అసూయ ఎక్కువైతే బీపీ, షుగర్ తో పాటు గుండెపోటు కూడా వస్తుందని సీఎం జగన్ చెప్పారు. అంతే కొనసాగితే ఏదో రోజు టికెట్ తీసుకుంటారని జగన్ ఎద్దేవా చేశారు.
ప్రతి ఇంటి మేనమామగా చిన్నారులను చదివించే బాధ్యత తనపైనే ఉందని తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు. ఏపీలో అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదన్నారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై కూడా సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాదేనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి కవ్వింపులు, బెదిరింపులు ఇవేవి నన్ను కదిలించలేవు, బెదిరించలేవు అన్నారు. దేవుడి దయతో పాటు ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చానని జగన్ స్పష్టం చేశారు.
వాళ్లు ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరు అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సేవ చేసుకునేందుకు ఆ దేవుడే మళ్లీ తనకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. సహకరించాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రోజుకో కట్టు కథను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా కట్టుకథలను ప్రచారం చేసి ఏపీ పరువును తీశారని టీడీపీపై ధ్వజమెత్తారు.
Read Also : CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సు.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు..!