సూర్యుడు తన వేడితో ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. సుర్రు సుర్రు సుర్రుమని మండిపోతూ.. వేడిని వెదజల్లుతున్నాడు. మండు టెండలు, ఉక్కపోత ప్రజలను బయటకు రానీయకుండా చేస్తోంది. ఉదయం నుంచే భానుడి భగభగలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పగటి పూటా అల్లాడిస్తుండగా. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదు అవుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే… నిప్పుల్లో అడుగు పెట్టినట్లుగా అల్లాడిపోతున్నారు. ఏదైనా అవసరం నిమిత్తం ఆరు బయటకు వెళ్లాలన్నా ఈ తీవ్ర ఎండలకు భయపడిపోతున్నారు. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. ఎండలు, వడగాల్పుల భయంతో చాలా మంది బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప… ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. అయితే నిన్న ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని చప్రాలలో 45.6 డిగ్రీలు, భోరాజ్లో 45.3 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్లో 45.1, గోవిందారంలో 45 డిగ్రీలు, నిర్మల్ జిల్లా బాసరలో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.