Farmer Jan Dhan Account : ఆ రైతు.. రోజువారీ కూలీ.. కూలీ పైసలను బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకునేవాడు. అతడి జన్‌ధన్ అకౌంట్లోకి ఒక్కసారిగా రూ. 15 లక్షలు క్రెడిట్ అయ్యాయి. ఆ విషయం తెలియని రైతు ఎప్పటిలానే బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వెళ్లాడు. అతడి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు ఉండేసరికి షాక్ అయ్యాడు. తన అకౌంట్లోకి ఎలా వచ్చాయో తెలియదు..
ఏది ఏమైనా మోడీనే తన అకౌంట్లోకి డబ్బులు వేశాడేమోలేని తెగ సంబరపడిపోయాడు. ఏమాత్రం వెనుక ముందు ఆలోచించకుండా ఆ డబ్బులతో బ్రహ్మండంగా ఇల్లు కట్టేశాడు.. చివరిలో అతడికి ఊహించని షాక్ తగలడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోకా తలపట్టేసుకున్నాడు. అయ్యో భలే పనైందేనని లబోదిబోమంటున్నాడు ఆ రైతు.. ఇంతకీ అతడి జన్ ధన్ అకౌంట్లోకి రూ. 15 లక్షలు ఎలా వచ్చాయనేది తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే (Dnyaneshwar Janardan Ote) అనే రైతు తన Jan Dhan Yojana Accountలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకునేందుకు వెళ్లాడు. అతడి అకౌంట్లో ఏకంగా రూ. 15 లక్షలు ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ డబ్బంతా తన అకౌంట్లోకి మోడీనే వేశారని తెగ సంబరపడిపోయాడు.
Farmer Jan Dhan Account : ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే రైతుకు జాక్ పాట్.. మోడీనే డబ్బులు వేశాడనుకుంటే.. !
ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇల్లు ప్లానింగ్ మొదలుపెట్టాడు. రూ. 15లక్షల్లో రూ. 9 లక్షలతో బ్రహ్మండమైన ఇల్లును కట్టించాడు. అంతంటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీకి మెయిల్ కూడా పెట్టాడు. అంతా అయిపోయిందిలే.. సంతోషపడిపోతున్న సమయంలో ఆ రైతుకు ఊహించని షాక్ ఎదురైంది. అతడి ఇంటికి ఓ లేఖ వచ్చింది.
ఆ లేఖ గ్రామ పంచాయతీ నుంచి రావడంతో ఏమిటదని చదివాడు. అందులో ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్‌వాడీ గ్రామ పంచాయితీకి రావాల్సిన రూ. 15 లక్షల నిధులకు సంబంధించి ఉంది. ఆ డబ్బులు పొరపాటున మీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయని అందులో రాసి ఉంది. క్రెడిట్ అయిన రూ.15 లక్షలను వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా కోరుతున్నామని ఉంది. అయితే అప్పటికే రూ. 9 లక్షలతో ఇల్లు కట్టేశాడు. ఇక అతడి దగ్గర అకౌంట్లో రూ. 6 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేశాడు. కానీ, ఖర్చు చేసిన రూ. 9 లక్షలు ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక సతమతమైపోతున్నాడు.