ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సీఎంఓ ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అంతే కాకుండా తమ అధీనంలోకి తీసుకున్న సీఎంఓ అకౌంట్ నుంచి దాదాపు 500 వరకు పోస్టులు పెట్టారు. అంతే కాకుండా అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ ను తీసేసి కార్టూన్ ఫొటోను పెట్టారు. ఆ తర్వాత కార్టూన్లు, ఎన్ఎఫ్ టీల చిత్రాలను హ్యాకర్లు పోస్టు చేశారు. వాటితో పాటు ఎన్ఎఫ్టీలను యానిమేషన్ రూపంలోకి ఎలా మార్చుకోవాలి?’ అనే ట్యుటోరియల్ను ట్వీట్ చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటలకు యూపీ సీఎంఓ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హ్యాకర్లు తమను తాము బోర్డ్ ఏప్వైసీ, యుగాల్యాబ్స్ సహ వ్యవస్థాపకులుగా అభివర్ణించుకున్నారు. ఈ రెండు సంస్థలు క్రిప్టో కరెన్సీలకు చెందినవే. ప్రభుత్వాధినేతలు, కీలక వ్యక్తుల ఖాతాలు ఇటీవల తరచూ హ్యాక్‌కు గురవుతున్నాయి. గతంలో కూడా చాలా మంది ప్రముఖల ఖాతాలు హ్యాక్ కు గురయ్యాయి.