...

Police Notification: వయో పరిమితి పెంపు పై ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. ఆగస్టులోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్!

Police Notification: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మరొక రెండు రోజులలో ఈ దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమ్స్ నిర్వహించగా 21వ తేదీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నెలలో వీటి ఫలితాలను విడుదల చేయనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాస్ రావు చెప్పారు.

ఈ క్రమంలోనే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దళారులను నమ్మి లక్షలు చెల్లించి మోసపోవద్దని ఉద్యోగాల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వీరిలో 68 శాతం మంది అభ్యర్థులు తెలుగు ఎంపిక చేసుకోగా, 32 శాతం మంది ఇంగ్లీష్ ఎంపిక చేసుకున్నారు.

ఈ క్రమంలోనే పలువురు అభ్యర్థుల నుంచి వయోపరిమితి గురించి పలు అభ్యర్థనలు వస్తున్నాయి.పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు మరో రెండు సంవత్సరాలు పెంచాలని అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై పూర్తి నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తామని శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఇక దరఖాస్తు ప్రక్రియకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. శుక్రవారం రాత్రి పది గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని అనంతరం, అభ్యర్థుల దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం హాల్ టికెట్ ప్రక్రియ మొదలుపెడతామని, అన్ని అనుకున్న విధంగా జరిగితే ఆగస్టు నెలలోనే ప్రిలిమ్స్ ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.