Tollywood Stars : మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవి చూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన ఎన్టీఆర్ మూడు సినిమాల్లో, ఏఎన్ఆర్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతిమాల,పద్మిని, అంజలీదేవి,సావిత్రి, జమున, రాజశ్రీ,గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తన ఉనికిని చాటుకున్నారు. తర్వాతి తరం హీరోల్లో కమల్ హాసన్,రజనీకాంత్, చిరంజీవి,నాగార్జున, వెంకటేష్, జె.డి.చక్రవర్తి కూడా హిందీ చిత్రాల్లో నటించారు.
ప్రస్తుతం గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది. ఈ సమయం లో ఉత్తరం, దక్షిణం అనే తేడాలు చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సౌత్ సినిమా దక్షిణాదిని దాటి, ఉత్తరాదిని చేరుకోవాలంటే అక్కడ భాషలోకి అనువాదం కావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు ఉత్తరాదిన సైతం హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దక్షిణాది చిత్రాల్లో తలుక్కున మెరిసిన వారు బాలీవుడ్ లో తడాఖా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫ్యామిలీ మాన్ టు సిరీస్ లో నటించి భళా అనిపించిన సమంత ఇప్పుడు ఏకంగా ఓ హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. మన తెలుగు సినిమాలతో వెలుగు చూసి తర్వాత బాలీవుడ్ లో భళా అనిపించినా తాప్సీ నిర్మించే సినిమాలో సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు రష్మిక మందనా కూడా మిషన్ మజ్ను చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి నటించబోతుంది.
మరో కథానాయిక రాశి ఖన్నా కూడా సిద్ధార్థ మల్హోత్రా సరసన యోధా అనే మరో సినిమాలో నటిస్తోంది. ఇక మన యువ కథానాయకుల్లో విజయ్ దేవరకొండ కూడా లైగర్ తో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తుండటం విశేషం. తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి నిర్మించిన చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో మన తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడు. ఇలా యంగ్ హీరోస్ సైతం ఉత్తరాదిన తమ ఉనికిని చాటుకోవడానికి ఉరకలు వేస్తున్నారు. మరి నవతరం హీరో,హీరోయిన్ల లో ఎవరు బాలీవుడ్ లో తమ మార్క్ చూపిస్తారో చూడాలి.
Read Also : LPG Cylinder Price: సామాన్యులకు భారంగా మారిన ఎల్పీజీ సిలిండర్… మరోసారి నింగికేగిరిన సిలిండర్ ధర!