Keerthi Jalli: సాధారణంగా కలెక్టర్ వెళ్తున్నారంటే వారితో పాటు ఎస్కార్ట్ కూడా వెళ్లడమే కాకుండా కలెక్టర్ పర్యటన కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసి ఉంటారు. అయితే అస్సాం కాచార్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నటువంటి కీర్తి జల్లి ఇందుకు ఎంతో భిన్నం.ఈమె స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. తాజాగా కాచార్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వరదలు ఏర్పడటంతో స్థానికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోని కలెక్టర్ కీర్తి వరద బాధిత ప్రాంతాలను పర్యటించి వెంటనే బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
అయితే వరద బాధిత ప్రాంతాల్లో కూరుకుపోయిన ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం ఏకంగా బురదలో నడుచుకుంటూ వెళుతూ స్థానిక ప్రజలను పలకరించి వారికి సహాయక చర్యలు చేపట్టారు. ఈ విధంగా కలెక్టర్ హోదాలో నిజమైన ప్రజా ప్రతినిధిగా ఈమె బాధ్యతలు చేపట్టడం చూసిన నెటిజన్స్ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈమె ఎవరు ఏంటి అని పెద్దఎత్తున ఈమె కోసం ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన ఈమె 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఆమె తండ్రి జల్లి కనకయ్య న్యాయవాది కాగా, తల్లి వసంత గృహిణి.2011లో బీటెక్ పూర్తి చేసి, దిల్లీలో ఐఏఎస్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న ఈమె 2013 సివిల్స్ లో అద్భుతమైన ర్యాంకు సంపాదించి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు చేపట్టిన మొదటి నుంచి ఈమె ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు కలెక్టర్ కీర్తి పెద్దపీట వేసి ఎంతో మంది మహిళలో మార్పులు తీసుకువచ్చారు. ఇలా ఈమె చేసిన సేవా కార్యక్రమాలను తెలుసుకున్న నెటిజన్లు ఈమె పై ప్రశంసల వర్షం కురిపించారు.