RRR Glimpse: సినిమా తెరకెక్కించడం లేటవుతుందేమో కానీ.. రికార్డులు తిరగరాయడం మాత్రం పక్కా. ఇది దర్శకధీరుడు రాజమౌళిపై అందరికీ ఉన్న అభిప్రాయం. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పిన రాజమౌళి, ప్రపంచ సినిమాని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఎటువంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటించి అందరినీ అబ్బురపరిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ అని ప్రకటించగానే మళ్లీ టాలీవుడ్ సత్తా చాటేందుకు జక్కన్న రెడీ అయ్యాడని అనుకున్నారంతా. తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్.. అది పక్కా అని చాటేలా చేసింది.
టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’. చిత్రం.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్ ఫిల్మ్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పోషిస్తున్నారు. చరణ్ సరసన ఆలియా భట్, యన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ నటించారు. సోమవారం ఈ చిత్రానిక సంబంధించిన వీడియో గ్లింప్స్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా 45 సెకండ్స్ పాటు విజువల్స్ వండర్‌గా ఉన్న ఈ గ్లింప్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
గ్లింప్స్ విషయానికి వస్తే.. అద్భుతమైన విజువల్స్‌తో, ఎమ్. ఎమ్. కీరవాణి అత్యద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ చూపును పక్కకు తిప్పుకోలేనంత ఎగ్జయిట్‌మెంట్‌ని కలిగిస్తోంది. తారక్, చరణ్ పాత్రల్లోని ఇంటెన్సిటీని ఎలా ఉండబోతుందో పరిచయం చేస్తూనే.. విజువల్‌గా ఈ సినిమా స్థాయి ఏంటో, ఎటువంటి కథతో ఈ సినిమా తెరకెక్కిందో.. ఈ గ్లింప్స్‌లో రాజమౌళి చూపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల అవుతోన్న ఈ చిత్రం కోసం వేచి చూసేలా చేయడంలో ఈ గ్లింప్స్ సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల తర్వాత రికార్డుల్ని లెక్కేసేందుకు అంతా సిద్ధమవ్వండి అనేలా గ్లింప్స్ ఉంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world