Hero Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నడుస్తోందని తెలుసుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ కేసుకు, హీరో నాగశౌర్యకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతుండగా ఇప్పుడు అతనికి బాబాయ్ అయిన బుజ్జి, అలాగే అతని తండ్రి, కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఈ కేసుకు లింక్ అవుతూ వినిపిస్తున్నాయి.
జూదం నిర్వహిస్తోన్న గుత్తా సుమన్ కుమార్ ఫోన్‌ని సీజ్ చేసిన పోలీసులు మరో 20 మంది ప్రముఖుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అలాగే గుత్తా సుమన్ కుమార్ చరిత్ర బయటికి తీస్తోన్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తుండటం విశేషం. చివరికి ఈ కేసు ఎటువైపుకు దారి తీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే హీరో నాగశౌర్యకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధాలు ఉన్నట్లుగా అయితే బయటికి రాలేదు.
నాగశౌర్య బాబాయ్ బుజ్జిపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్ కాలనీలోని ఓ ఇండిపెండెంట్ హౌస్‌లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు సుమారు 30 పేకాటరాయుళ్లను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 6.77 లక్షల నగదు, 33 మొబైల్ ఫోన్లు, 29 పేకాట సెట్లు, 2 కాసినో కాయిన్లు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిగా చెప్పుకోబడుతోన్న ఈ ఇండిపెండెంట్ హౌస్‌ని, బర్త్‌డే పార్టీ నిమిత్తం గుత్తా సుమన్ కుమార్ అనే అతను ఒక రోజు రెంట్‌కు తీసుకున్నట్లుగా ప్రాధమిక విచారణలో తెలిసిందని పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ కేసుపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చర్చలు నడుస్తున్నాయి.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world