జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం పై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిని కెసిఆర్ మొదలు పెట్టారా? నెక్స్ట్ కేసిఆర్ భేటీ ఏ ప్రాంతీయ పార్టీ నేతతో ఉండే అవకాశం ఉంది? బిజెపిని గద్దె దించాల్సిందే అని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్,కమలదళం వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ బృందం కేసీఆర్ తో సమావేశమైంది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసి రెండు గంటల పాటు చర్చించారు.
బిజెపి విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. బీజేపీ వ్యతిరేక పోరాటం జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ ను లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కోరారు. ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మాజీ సీఎం లాలూ తో ఫోన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆయన ఆరోగ్య, క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు. తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన విషయాన్ని లాలూ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని కెసిఆర్ ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించినట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్ ని కలిసి జాతీయ రాజకీయాలు,2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు సీఎం కేసీఆర్. ఇక లెఫ్ట్ పార్టీల అగ్రనేతలతో ఇటీవల భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో పోరాటానికి తాము సిద్ధమని లెఫ్ట్ పార్టీల అగ్రనేతలు స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమై, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేశారు కేసీఆర్. ఇప్పుడు మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.