Huzurabad ByPoll : సుమారు 6 నెలలుగా రాష్ట్ర పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైన హుజూరాబాద్ బైపోల్ ఎట్టకేలకు ముగిసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు టీఆర్ఎస్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ఈటలపై అవనీతి ఆరోపణలు రావడం.. దాంతో ఆయనను మంత్రి పదవి నుంచి టీఆర్ఎస్ అధిష్ఠానం బర్తరఫ్ చేయడం.. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.
అనంతరం ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచే తన ప్రచారం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ సైతం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను హుజూరాబాద్ నియోజకవర్గంలో దింపింది. డోర్ టు డోర్ ప్రచారం చేపట్టింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇక అప్పటి నుంచి సీఎం కేసీఆర్.. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వివరాలు తెప్పించుకున్నారు. ప్రచారంలో మరింత జోష్ పెంచారు.
ఈటల మాత్రం ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి బలంగా వెళ్లారు. ఈటలకు స్థానిక బ్యాగ్రౌండ్ ఉండటం, దానికితోడు సింపతి కూడా వర్కౌట్ అయింది. కానీ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్.. ఈ మూడు ప్రధాన పార్టీలు బరిలోకి దిగినా.. పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని మొదటి నుంచీ అందరూ ఊహించారు. అలాగే జరిగింది కూడా. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కనీస పోటీ సైతం ఇవ్వలేదు.
అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించారు. ఆ రోజు సైతం ఓటర్లకు ప్రలోభాలు ఆగలేదు. ఇక ఎట్టకేలకు నవంబర్ 2న ఫలితాలు వచ్చాయి. ఇందులో సుమారు 24 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఇక టీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమవగా.. కాంగ్రెస్ కేవలం సుమారు 3 వేల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.
ఇక ఫలితాల అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేనట్టుగా హుజూరాబాద్ బై పోల్‌లో బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పని చేశాయని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. ప్రజలు వీటిని గమనిస్తున్నారన్న ఆయన.. ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదు అని.. ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also : Badvel ByPoll Results : బద్వేలు ఉపఎన్నికలో సీఎం జగన్ రికార్డు బ్రేక్.. షాక్‌లో వైసీపీ అభిమానులు!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world