Ugadi 2022: తెలుగువారికి అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర మాసం మొదటి రోజున ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజు ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకుంటారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు రుచులను షడ్రుచులు అంటారు. ఈ ఆరు రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తాము. ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనే విషయానికి వస్తే… వేపపువ్వు, బెల్లం, పచ్చిమామిడి, చింత పులుపు, పచ్చిమిర్చి, అరటిపండు, ఉప్పు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.
ముందుగా వేపపువ్వును శుభ్రం చేసుకొని పక్కన పెట్టాలి. అలాగే మామిడి, బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోవాలి.ముందుగా నానబెట్టిన చింతపండు పులుపు తీసి ఒక గిన్నెలో వేయాలి అనంతరం అందులోకి బెల్లం వేసి బెల్లం కరిగేలా కలియబెట్టాలి. బెల్లం కరిగిన తర్వాత ఉప్పు, వేపపువ్వు ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మామిడి తురుము, అరటిపండు ముక్కలు అవసరం అనుకుంటే చెరుకు ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. ఇలా ఆరు రుచులను కలిపితే తయారయ్యేది ఉగాది పచ్చడి. ఈ విధంగా తయారు చేసుకున్న ఉగాది పచ్చడి ముందుగా దేవుడికి నైవేద్యంగా సమర్పించి అనంతరం కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి.