Viral Video: బైక్ పై తల్లి మృతదేహంతో 80కి.మీ. ప్రయాణం.. ఇంకెన్ని రోజులు ఈ అమానవీయం

Viral Video: మళ్లీ అదే తరహా ఘటన. అదే అమానవీయం. ఒకరి నిర్లక్ష్యం మరొకరికి పెను శాపంగా మారుతోంది. తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో.. బైక్ పై తీసుకు వెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని షాహ్ దోల్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ వైద్య సిబ్బంది, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం మరో మారు బయట పడింది. రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో చనిపోయిన ఓ తల్లి మృతదేహానికి వాహనాన్ని సమకూర్చుకపోవడం అక్కడి ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది.

అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో.. ఆ వ్యక్తికి ఇక చేసేదేం లేక పోయింది. ప్రైవేటు వాహనాన్ని అడగ్గా.. వారు 5 వేల రూపాయలు ఇస్తేనే వస్తామని చెప్పారు. తన దగ్గర బైక్ ఉండటంతో దానిపైనే తన తల్లి మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 100 రూపాయలు పెట్టి చెక్క పలకలు కొన్నాడు. దానిపై తన తల్లి మృతదేహాన్ని కట్టి పెట్టాడు. మరో వ్యక్తి సాయంతో బైక్ పై తీసుకు వెళ్లాడు. తన స్వగ్రామం 80 కిలో మీటర్ల దూరంలో ఉండగా… అంత దూరం శవాన్ని అలాగే బైక్ పై తీసుకు వెళ్లారు. కొందరు ఈ అమానవీయ ఘటనను వీడియో తీశారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. చాలా మంది ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.