Danush Aishwarya Divorce : సినిమా పరిశ్రమలో మరో జంట బ్రేకప్ చెప్పారు. టాలీవుడ్ లవ్లీ కపూల్ నాగచైతన్య, సమంత బాటలోనే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ ధనుష్ విడిపోయారు. తాము విడాకులు తీసుకున్న విషయాన్ని స్వయంగా ధనుష్ ట్విట్టర్ ద్వారా..ఇన్‌స్టా వేదికగాను ఐశ్వర్య వెల్లడించారు. ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా విడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్టు ఇద్దరూ ప్రకటించారు.
18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట ముగింపు పలకడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా ఉండే ఈ జంట విడిపోయారన్న వార్త రజనీకాంత్, ధనుష్ అభిమానుల్ని కొంత కలవరపెడుతోంది. మరోవైపు స్టార్ కపుల్ విడిపోతున్నట్లు ప్రకటించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు మంచి నిర్ణయం తీసుకున్నారని సమర్ధిస్తుంటే..మరికొందరు ఎందుకలా చేశారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.గత 18 సంవత్సరాలుగా తాను, ఐశ్వర్య స్నేహితుల్లా, భార్యభర్తల్లా, తల్లిదండుల్లా, శ్రేయోభిలాషుల్లా ఒకరికొకరం కలిసి ప్రయాణం కొనసాగించామని ధనుష్ తెలిపారు. తమ వైవాహిక జీవన ప్రయాణంలో ఒకరినొకరు అర్ధం చేసుకొని సర్దుకుపోయామన్నారు.
కానీ ప్రస్తుతం తాము కలిసి జీవించాలని భావించడం లేదని వెల్లడించారు. ఇద్దరం విడిపోయి వేర్వేరుగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు జీవించాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ధనుష్.తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలని, ఈ విషయంలో తాము స్వేచ్ఛను కోరుకుంటున్నామని ధనుష్ అభిమానుల్ని కోరారు. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ధనుష్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కోలీవుడ్‌లో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన ధనుష్.. సినిమా, సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తన నటనతో ఎంతోమంది అభిమానులతో పాటు రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.
త్వరలో సార్ సినిమాతో తెలుగులోకి డైరెక్ట్‌గా ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకు ధనుష్ ఓకే చెప్పాడని టాలీవుడ్ టాక్. ఇటు ఐశ్వర్య.. రజనీకాంత్ పెద్ద కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట ప్లే బ్యాక్ సింగర్‌గా అరంగేట్రం ఇచ్చిన ఐశ్వర్య.. తర్వాత డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
భర్త ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన 3 అనే చిత్రాన్ని తెరకెక్కించి దర్శకురాలిగా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత వాయ్ రాజా వాయ్ అనే మూవీతో పాటు సినిమా వేరన్ అనే డ్యాక్యుమెంటరీని రూపొందించింది. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు యాత్ర, లింగా అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ.. ఇంతకాలం ఎంతో హ్యాపీగా, సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితానికి స్వస్తి పలకడం ఇటు ధనుష్, అటు రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also : అతనే నా సర్వస్వం అంటున్న బాలీవుడ్ హీరో.. ఇంతకీ ఎవరాయన..?