AP Amaravati : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి తెలుగు పుస్తకం నుంచి అమరావతి పాఠాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను విద్యాశాఖ ఆయా పాఠశాలకు పంపించింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని ముద్రించారు. ఇతివృత్తం , సాంస్కృతిక వైభవం కింద అమరావతి పాఠ్యాంశం ఉండేది. అమరావతి చరిత్ర నుండి పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్్ రాజధానికి ఎంపిక కావడం వరకు… అందులో పొందుపరిచారు. నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే తెలుగు పుస్తకాలను ముద్రించింది.
విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని ఇవ్వాలని టీచర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు. ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. పుస్తకాలు అందరికీ సరఫరా అయ్యాకే అందులో అమరావతి పాఠం లేదనే విషయాన్ని గుర్తించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నదానిపై విద్యా శాఖ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
అయితే ప్రతి పక్ష పార్టీల నేతలు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. అమరావతిపై కక్షతోనే జగన్ ప్రభుత్వం అమరావతి పాఠాన్ని తొలగించిందని ఆరోపిస్తున్నారు. అమరావతి అనే పదంపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సీఎం జగన్‌కు లేఖ రాసి అందులో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు.
Read Also : Petrol Prices Today : మళ్లీ బాదుడు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 14 రోజుల్లో 12సార్లు పెంపు..!