...

Allu Arjun in Trouble : ఆ యాడ్‌లో చేసినందుకే ‘అల్లు అర్జున్‌’కు లీగల్ నోటీసులు.. ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు

Allu Arjun in Trouble : టీఎస్ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ కేడర్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక తనదైన కొత్త ఆలోచనలతో ఆర్టీసీని కొత్త పంథాలో నడిపిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యల వల్లే దసరా పండుగ సమయంలో ఆర్టీసీకి మంచి కలెక్షన్లు వచ్చాయని పలు డిపోలకు చెందిన మేనేజర్లు సైతం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ తరఫున లీగల్ నోటీసులను పంపించారు. కారణం ఆయన నటించిన రాపిడో యాడ్ ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఆర్టీసీని కించపరిచేలా ఉండటమే. రాపిడో సంస్థకు కూడా నోటీసులు పంపించినట్టు సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ యాడ్ పట్ల ఆర్టీసీ ఎండీ సీరియస్ అవ్వడానికి, హీరో అల్లు అర్జున్‌కు నోటీసులు పంపడానికి అందులో అంతగా ఏముందని అందరికీ అనుమానం రావొచ్చు. దీనికి వెనుక గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాపిడో ప్రకటన ఆరంభంలో అల్లు అర్జున్ టిఫిన్ సెంటర్‌లో దోశలు వేస్తూ కనిపించగా.. ఆర్టీసి బస్సులో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడుతూ ప్రయాణిస్తుంటారు.

ఒక్కొక్కరు చెమటలు కక్కుతూ టిఫిన్ సెంటర్ ముందు దిగుతుంటారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును నమ్ముకుంటే డబ్బులు పోగా, ఒళ్ళంతా హూనం అవుతుందనే అర్థం వచ్చేలా అల్లు అర్జున్ కామెంట్స్ ఉంటాయి. అనవసరంగా ఈ బస్ ఎక్కి ఒళ్ళు హూనం చేసుకునే బదులు ‘రాపిడో’ బుక్ చేసుకుని హాయిగా షర్ట్ నలగకుండా మీరు నచ్చిన చోటుకు వెళ్లిపోండని చెప్తాడు. ఈ యాడ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

సెలబ్రిటీ అయ్యుండి ఇటువంటి వాణిజ్య ప్రకటనలు ఎలా చేస్తారంటూ సజ్జనార్ ప్రశ్నించారు. ఈ యాడ్ ముమ్మాటికీ ఆర్టీసి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందువల్లే అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపించినట్టు సజ్జనార్ తెలిపారు. మెరుగైన సమాజం కోసం సెలబ్రిటీలు ప్రజా రవాణాను ప్రమోట్ చేయాలి గానీ ఇలా పరువు తీసేవిధంగా యాడ్స్ చేయరాదని సజ్జనార్ సీరియస్ అయ్యారు.
Read Also :  Pawan Kalyan : ‘చిరు’ సూపర్ హిట్ మూవీ రీమేక్‌లో తమ్ముడు ‘పవన్ కళ్యాణ్’.. అన్ని కుదిరితే ఫ్యాన్స్ పండగే!