Dowry Harassment : వరకట్నం తీసుకోవడం చట్ట రీత్యా నేరం. కట్నం కోసం డిమాండ్ చేసే వారిపై కేసు పెట్టొచ్చు. వారికి చట్టపరంగా శిక్ష కూడా విధిస్తాయి కోర్టులు. కట్నం చట్టరీత్యా నేరం అని చాలా మందికి తెలుసు. అటు ఇచ్చే వారికి, ఇటు తీసుకునే వారికి కూడా దీనిపై అవగాహన ఉంటుంది. కానీ.. పెళ్లి సమయంలో కట్నం ఇవ్వడం మాత్రం ఆగడంలేదు. వరకట్నం కోసం డిమాండ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కానీ తగ్గటం లేదు.
రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోటా వరకట్నం కోసం వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు ఆడబిడ్డలు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో అత్తారింటి ధన దాహం ఓ ఇల్లాలి అందులోనూ గర్భవతి అయిన మహిళ ప్రాణాలను తీసింది. రెండేళ్లు నిండకుండానే మూడు ముళ్ల బంధం ఆ ఇల్లాలికి శాపంగా మారింది.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజ్ పేటతండాలో ఈ ఘటన జరిగింది. మల్కాపూర్ కు చెందిన కల్యాణికి రాజ్ పేట్ తండా వాసి తరుణ్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు దంపతులు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భర్త సహా అత్తమామలు పోరు ప్రారంభమైంది. ఆమెను వదిలించుకోవాలనే దురుద్దేశంతో మానసికంగా, శారీరకంగా బాధపెట్టేవారు.
మంగళవారం భర్తతోపాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్ బాధితురాలికి బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు. కల్యాణి కేకలు విన్న పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ వచ్చే సరికి కల్యాణి నురగలు కక్కుతూ కనిపించింది. పక్కంటివారి సాయంతో నిజామాబాద్ బాధితురాలిని జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
Read Also : UAE: వాయమ్మో… అక్కడ బాల్కనీలో బట్టలు ఆరేస్తే 20 వేలు జరిమానా.. ఎక్కడో తెలుసా?