Karimnagar Girl Murder : మైనర్ ప్రేమ ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ దారుణానికి పాల్పడింది ప్రియుడే అని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కరీంనగర్ గుట్టల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
Karimnagar Girl Murder : ప్రియురాలిపై అత్యాచారం, హత్య..
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి.. పక్క గ్రామమైన పోరండ్లకు చెందిన అఖిల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ ఐదేండ్లు ప్రేమించుకున్నారు. అయితే, వీరు మైనర్లు కావడంతో వివాహానికి పెద్దలు నో చెప్పారు. ఇరుకుటుంబాలు పంచాయితీ పెట్టించగా అమ్మాయి, అబ్బాయిని దూరంగా ఉంచాలని పెద్దలు తీర్పు చెప్పారు. ఈ క్రమంలోనే అఖిల్ మళ్లీ ప్రియురాలికి దగ్గరయ్యాడు. ఓ రోజు తన లవర్‌ను తీసుకుని కరీంనగర్‌లోని చెంజర్ల ప్రాంతంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లి అత్యాచారం అనంతరం హత్య చేసినట్టు తెలుస్తోంది.
వారం రోజులుగా అమ్మాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో భాగంగా అమ్మాయి లవ్ స్టోరీ గురించి తెలుసుకుని అఖిల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. హత్యాచారం చేసిన ప్రాంతానికి పోలీసులను తీసుకెళ్లగా అక్కడ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, తమకు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన తెలుపుతున్నారు. ప్రేమ పేరుతో తమ కూతురిని అన్యాయంగా చంపేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని బాధిత ఫ్యామిలీ మెంబర్స్ గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Read Also : Vanama Raghava : వనమాపై రామకృష్ణ సంచలన కామెంట్స్.. అసలు సూత్రధారి ఆయనేనంటూ మరో వీడియో..