Crime News : చిట్టీల పేరుతో బారి మోసం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నెల నెల కొంచెం కొంచెం కూడబెట్టి చిట్టీలలో సొమ్ము దాచుకుంటున్న ప్రజలను నమ్మించి రూ. 2.5 కోట్లతో ఉడాయించారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులు మద్దిరాల పద్మ, విజయ్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్నారు. 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు.
వారిని నమ్మి స్థానికులంతా వారి వద్ద ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. దాంతో భారీ మొత్తం నగదు కూడబెట్టుకుని గత వారం క్రితం రాత్రికి రాత్రే ఇల్లు కాలి చేసి వెళ్లిపోయారు. తొలుత వారు ఊరికెళ్లారని భావించారు పొదుపు చేసిన వ్యక్తులు. ఆ తరువాత వారు పారిపోయారని గుర్తించిన బాధితులు.. దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే… బాధితులంతా నేడు నిందితుడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 120 మంది వద్ద సుమారు రూ.2.5 కోట్ల నగదు సేకరించి రాత్రికి రాత్రే ఉడాయించారని బాధితులు వాపోయారు.
నిందితులు నివాసం ఉన్న ఇల్లును సైతం విక్రయించినట్లు బాధితులు గుర్తించారు. కేవలం చిట్టి నగదే కాకుండా.. పలువురు వద్ద తన ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి బంగారం సైతం తీసుకెళ్లారు ఈ మాయ దంపతులు. కుటుంబ సభ్యుల ఆపరేషన్లు, బిడ్డల పెళ్లిళ్ల కోసం నగదు కూడబెట్టుకుంటే ఇలా మోసం చేయడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కంటతడి పెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World