...

Aryan Khan‌కు బెయిల్.. RGV వాయింపుడు మొదలు

RGV and Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అయితే అతనికి బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ వినబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినీ కుటుంబానికి చెందిన కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం మన వ్యవస్థ ఎలా ఉందో? తెలుసుకోవడానికి ఈ సంఘటన ఒక్కటి చాలంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ అయితే ఒకడుగు ముందుకు వేసి.. ఈ కేసులో ఇంతకు ముందు వాదించిన లాయర్లను అసమర్థులుగా చెప్పుకొచ్చాడు.

‘‘ముకుల్ రొహత్గీ (ఆర్యన్ ఖాన్ కేసును వాదిస్తున్న ప్రస్తుత లాయర్) వాదనలతోనే ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్ వచ్చింది. అంటే గతంలో ఆర్యన్ తరపున ఈ కేసును వాదించిన లాయర్లు అసమర్థులా?. అందుకేనా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపాల్సి వచ్చింది. దేశంలోని చాలామంది ప్రజలు ముకుల్ రొహత్గీ వంటి ఖరీదైన లాయర్లను నియమించుకోలేరు. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే.. అనేక మంది అమాయక ప్రజలు జైలులో అండర్ ట్రయల్‌గా జైలు జీవితం గడుపుతున్నారు’’ అంటూ వర్మ ఈ బెయిల్ వ్యవహారంపై కౌంటర్లు పేల్చాడు.

వర్మ వ్యవహారం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ విషయంపై ఓ సినిమా ప్రకటించినా ప్రకటించవచ్చు.. అనేలా ఆయన చేసిన ట్వీట్‌కి కామెంట్స్ పడుతున్నాయి. వాస్తవానికి వర్మ చెప్పిన దానిలో తప్పేం లేదు. ప్రభుత్వాలు, చట్టాలు బలవంతులకు ఒకలా, బలహీనులకు మరోలా ఉంటాయనేది ఇక్కడ క్లియర్‌గా సుస్పష్టం అవుతుంది. ఇదే కేసులో ఇప్పుడొక సామాన్యుడు ఉన్నట్లయితే.. అతనికి బెయిల్ దొరికేదా? అలాంటి వాళ్లు ఎందరో జైలులో ఉన్నారనేది వర్మ వాదన, ఆవేదన. ఇదిలా ఉంటే, ఆర్యన్‌కు బెయిల్ రావడంపై సోనూసూద్, మాధవన్ వంటి వారు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు.

‘‘ఒక తండ్రిగా నేను ఉపశమనం పొందాను. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను.. దేవుడికి ధన్యవాదాలు..’’ అని ఆర్యన్ అంతటి కొడుకు ఉన్న హీరో మాధవన్ ట్వీట్ చేస్తే.. ‘ప్రత్యక్ష సాక్షులు అవసరం లేదు. న్యాయం గెలుస్తుందని కాలమే చెబుతోంది’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. ఇలా మరికొందరు సెలబ్రిటీలు కూడా ఆర్యన్‌కి బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే షారూఖ్ కొడుకు కాకుండా ఆర్యన్ సామాన్యుడు అయి ఉండి, అతనికి బెయిల్ వచ్చి ఉంటే.. అప్పుడు కూడా వాళ్లు ఇలానే రియాక్ట్ అవుతారా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.