...

Acharya Review : ‘ఆచార్య’ రివ్యూ : ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ, కానీ…!

Acharya Review : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చిన నేపద్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. తండ్రి కొడుకులు మొదటి సారి కలిసి నటించిన సినిమా కావడంతో ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు కూడా ఆచార్య పై ఆసక్తి కనబర్చారు. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ధర్మస్థలి గురుకులం సంరక్షకుడిగా సిద్ద (రామ్‌ చరణ్‌) వ్యవహరిస్తూ ఉంటాడు. స్థానికులకు రక్షణగా ఉంటూ… వారికి అండగా ఉంటాడు. ఎంతో ప్రసిద్ది గాంచిన ధర్మస్థలి పై బసవ(సోనూసూద్‌) కన్నుపడుతుంది. ధర్మస్థలిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అందుకు అడ్డుగా ఉన్న సిద్ద ను తప్పించాలని భావిస్తాడు బసవ. అనూహ్య కారణాల వల్ల సిద్ద ధర్మస్థలి ని వదిలేస్తాడు. దాంతో ధర్మస్థలి సమస్యల్లో చిక్కుకుంటుంది. అప్పుడే అక్కడకు ఆచార్య వస్తాడు. ఆచార్యకు సిద్దకు సంబంధం ఏంటీ? ధర్మస్థలిని బసవ బారి నుండి ఆచార్య ఎలా కాపాడాడు? అనేది కథాంశం.

Acharya Review _ Megastar Chiranjeevi Acharya Movie review
Acharya Review _ Megastar Chiranjeevi Acharya Movie review

నటీ నటుల నటన :
మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సుదీర్ఘమైన నటన అనుభవంని ఆచార్య సినిమాలో కూడా చూపించారు. తన ప్రతి షాట్‌ మరియు ప్రతి సన్నివేశంలో కూడా అద్భుతమైన నటనను కనబరిచాడంతో పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసే పట్టుదల కృషి కనిపించింది. ఈ వయసులో కూడా డాన్సులు మరియు యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కనిపించిన తీరు నిజంగా అభినందనీయం. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన రామ్ చరణ్ పాత్ర పరిధి తక్కువగానే ఉన్నా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు.

సిద్ధ పాత్రకి సరిగ్గా చరణ్‌ లుక్‌ సెట్ అయింది. ఆ పాత్రకు తగ్గట్టుగా నటించి ఆకట్టుకున్నాడు. తండ్రితో కలిసి నటించిన సన్నివేశాల్లో పోటీపడి మరీ నటించాడు అనిపించింది. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు డాన్సుల్లో కూడా తండ్రి పాత్ర తో పోటీ పడ్డాడు. తండ్రి కొడుకు నటించిన సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కి కన్నుల విందు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పూజా హెగ్డే చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. సంగీత పాత్ర పరిమితంగా ఉన్న ఆకట్టుకుంది. మొత్తంగా సినిమాలో కనిపించిన నటీ నటులు వారి వారి పాత్రల పరిధిలో నటించారు.

టెక్నికల్‌ :
సినిమాకు మణిశర్మ పాటలు మరియు నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంతా భావించారు. సినిమా విడుదలకు ముందే ఆచార్య పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి అంత చర్చ జరిగింది. సహజంగానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి పెట్టింది పేరు. అలాంటి మణి శర్మ ఆచార్య కోసం ది బెస్ట్ అని ప్రతి ఒక్కరు భావించారు. కాని ఆయన ఈ సినిమా కోసం మంచి నేపధ్య సంగీతాన్ని ఇవ్వడంలో విఫలం అయ్యారు. కొరటాల శివ ఆయన నుండి బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ను రాబట్టుకోలేక పోయారు.

ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో చిరు, చరణ్‌ ను చూపించిన తీరు మెగా అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ఉంది. చాలా సన్నివేశాలు చాలా నాచురల్ గా ఉండడంతో పాటు ఆసక్తి పెంచే విధంగా సినిమాటోగ్రఫీ ఉంది. దర్శకుడు కొరటాల శివ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. ఆయన స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక కథానుసారం నిర్మాణాత్మక విలువలు భారీగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో చిన్న చిన్న తప్పులు ఉన్నా మొత్తంగా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
చిరంజీవి, రామ్‌ చరణ్‌
ధర్మస్థలి సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :
దర్శకత్వం,
స్క్రీన్‌ ప్లే,
కథ లో పట్టులేక పోవడం

విశ్లేషణః
మగధీర మరియు బ్రూస్లీ సినిమాల్లో చరణ్ మరియు చిరంజీవి లు కొన్ని నిమిషాలు వెండి తెరపై కనిపిస్తేనే మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. అలాంటిది ఆచార్య సినిమా లో ఫుల్ లెన్త్ పాత్రలో రామ్చరణ్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను దర్శకుడు కొరటాల శివ అందుకుంటాడా అంటూ మొదటి నుండే అనుమానాలు ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండేలా ప్లాన్ చేశాడు. ఆ సమయంలో కథ విషయంలో కొరటాల శివ పట్టు కోల్పోయాడు. సిద్ధ పాత్ర సాగతీసినట్లుగా అనిపించింది.

చిరు చరణ్ ల మధ్య సన్నివేశాలు ఉండాలనే ఉద్దేశంతో స్క్రీన్‌ ప్లే నడిపించాడు. చిరు, చరణ్ ల మద్య ఉన్న సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఒక అందమైన అనుభూతి కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. కాని ఓవరాల్‌ గా మాత్రం సినిమా నిరాశ పర్చిందని చెప్పక తప్పదు. కొరటాల శివ భారీ స్టార్ కాస్టింగ్‌ వల్లనో లేదా మరేదో కారణం వల్ల గతి తప్పినట్లుగా అనిపిస్తుంది.

రేటింగ్ : 2.5/5.0

Read Also : Acharya movie updates : మెగాస్టార్ సినిమా ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!