Anchor Suma: సుమ కనకాల ప్రధాన పాత్రలో మొట్టమొదటిసారిగా వెండితెరపై పూర్తిస్థాయి చిత్రంలో కనిపించనుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన జయమ్మ పంచాయతీ అనే సినిమాలో సుమ జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 6వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమా కోసం ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాని, రానా వంటి హీరోల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు విడుదలయ్యాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.నేడు ఉదయం 11 గంటలకు విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సుమ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోందని చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.ఈ ట్రైలర్ లో భాగంగా తన ఇద్దరు కూతుర్లు ఎదుర్కొనే సమస్యలు తన భర్త ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్యల గురించి చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ముఖ్యంగా సినిమాలో సుమ యాస, వేషం ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.బుల్లితెరపై అందరినీ ఆకట్టుకున్న సుమ వెండితెరపై జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.