KGF 2 Movie Review : కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నా కే జి ఎఫ్ 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అత్యధిక వసూళ్లను దక్కించుకుందనే నమ్మకం తో ప్రతి ఒక్కరు ఉన్నారు. కేజిఎఫ్ 1 సాధించిన విజయంతో ఈ సినిమా పై నమ్మకం పెరిగింది. యశ్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో మరో అద్బుతం ఆవిష్కారం అయ్యిందని ప్రతి ఒక్కరి నమ్మకం. మరి ఈ సినిమా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది లేదా అనేది చూద్దాం.
కథ :
కేజీఎఫ్ 1 ఎక్కడ అయితే ముగిసిందో కేజీఎఫ్ 2 అక్కడే మొదలు అయ్యింది. కేజీఎఫ్ లో గరుడను చంపేసిన తర్వాత రాకీ భాయ్ అక్కడి సామ్రాజ్యం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. రాకీ భాయ్ తో రీనా తండ్రి రాజేంద్ర ప్రసాద్ మరియు గరుడ సోదరుడు దయా ఇంకా ఆండ్రూస్ లు చేతులు కలిపి సామ్రాజ్యంను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు. అయితే రాకీ భాయ్ కి వారిపై అనుమానంగానే ఉంటుంది. కేజీఎఫ్ లోకి రీనాను తీసుకు వెళ్లి అక్కడే ఉంటాడు. అయితే రాకీని అక్కడ నుండి బయటకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. మరో వైపు అధీరా బతికే ఉండటంతో అతడితో పోరాటంకు సరైన సమయం కాదనే ఉద్దేశ్యంతో రాకీ బాయ్ దుబాయి వెళ్లి పోతాడు. అక్కడ నుండి ఆపరేషన్స్ నిర్వహిస్తాడు. మళ్లీ రాకీ భాయ్ తిరిగి ఎలా వచ్చాడు.. రాకీ భాయ్ మరియు అధీరా మద్య జరిగిన యుద్దంలో గెలుపు ఎవరిది అనేది కథ.
నటీనటుల నటన :
రాకీ భాయ్ గా యశ్ నటన మరో సారి హైలైట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ప్రతి సన్నివేశంలో కూడా అద్బుతంగా నటించాడు. ప్రతి సన్నివేశంలో కూడా ఆయన మాస్ ఎలిమెంట్స్ చూపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో మంచి నటనతో మెప్పించాడు. కేజీఎఫ్ లో అతడి నటన మరింతగా సినిమాకు ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక సంజయ్ దత్ నటించిన తీరు ఆకట్టుకుంది. ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి ఒక పాత్రను చేయడం అంటే చాలా సాహసంతో కూడుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని సంజయ్ దత్ తీసుకుని ఒప్పుకోవడం అభినందనీయం. ఇక రవీనా టాండన్ కు ఉన్నంతలో మంచి పాత్ర లభించింది. ఆమె పర్వాలేదు అనిపించింది. ఇక ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. మొత్తంగా యశ్ సినిమా ను డామినేట్ చేశాడు. హీరోయిన్ పాత్ర కూడా లిమిటెడ్ గానే ఉంది.
టెక్నికల్ :
దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి సినిమా లో అద్బుతమైన విజువల్స్ ను మాస్ ఆడియన్స్ కోసం చూపించాడు. ఆకట్టుకునే అంశాలతో పాటు మంచి స్క్రీన్ ప్లే తో సినిమా ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశంలో కూడా ఆయన పనితనం బాగుంది. సినిమాటోగ్రఫీ మరోసారి అద్బుతంగా పని చేసింది. సినిమా లోని సన్నివేశాలను హైలైట్ చేసి చూపడం లో సినిమాటోగ్రఫీ అద్బుతంగా పని చేసింది అనడంలో సందేహం లేదు. సంగీతం పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గానే ఉంది. నిర్మాణాత్మక విలువలు భారీగా ఉన్నాయి. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మొత్తంగా పర్వాలేదు అనిపించింది.
ప్లస్ పాయింట్స్ :
కేజీఎఫ్ సన్నివేశాలు,
ప్రశాంత్ నీల్ డైరెక్షన్,
యశ్ మాస్ ఎలివేషన్,
సినిమాటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్ :
స్టోరీ సాగతీసినట్లుగా ఉంది,
యాక్షన్ సన్నివేశాల ఓవర్ డోస్,
సెంటిమెంట్ లేకపోవడం.
విశ్లేషణ :
మొదటి కేజీఎఫ్ కు అద్బుతమైన రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో రెండవ పార్ట్ పై సాదారణంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైకే కేజీఎఫ్ 2 తో పోల్చితే కేజీఎఫ్ 1 అనేది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. దాంతో కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. అంచనాలు ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో సినిమా ఓ రేంజ్ లో ఉంటేనే ఆకట్టుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ మరియు బాహుబలి అంటూ ప్రచారం చేసిన కేజీఎఫ్ 2 ఆ స్థాయి లో లేదనే చెప్పాలి. శృతి మించిన యాక్షన్ సన్నివేశాలతో పాటు కథను సాగతీసినట్లుగా ఉండి బోర్ కొట్టించారు. కొన్ని సన్నివేశాల్లో అసహజత్వపు పోకడలు కనిపించాయి. మొత్తానికి కేజీఎఫ్ 2 ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ సినిమా గా కాకుండా యాక్షన్ ప్రియులకు నచ్చే సినిమా మాత్రమే ఉంది.
రేటింగ్ : 2.75/5.0
Read Also : KGF 2 Twitter Review : దుమ్మురేపుతున్న కేజీఎఫ్2.. ఫ్యాన్స్ రచ్చ.. పబ్లిక్ టాక్ ఇదిగో..!