Radhe Shyam Review : ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు గత మూడేళ్లుగా రాధేశ్యామ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సాహో సినిమా విడుదలకు ముందుగానే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు ఆనందంతో ఉన్నారు. కరోనా తర్వాత దేశంలో విడుదలైన మొదటి అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే. కనుక ఈ సినిమా వైపు మొత్తం దేశ సినీ పరిశ్రమ తిరిగి చూస్తుంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ :
విక్రమాధిత్య (ప్రభాస్) ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జ్యోతిష్యుడు. చేతి రేఖలు చూసి వారి యొక్క భవిష్యత్తును గతంలో జరిగిన విషయాలను సునాయాసంగా చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇటలీకి వెళ్తాడు. ఆ సమయంలో ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. ప్రేరణ మొదట కొంత సమయం కావాలంటుంది.. ఆ తర్వాత ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను ఎలా విక్రమాదిత్య సాధించుకున్నాడు.. వారి ప్రేమకి విధి అనేది ఎలా అడ్డుపడింది అనేది కథ.
నటీనటుల నటన :
విక్రమాదిత్య పాత్రకు ప్రాణం పోసినట్లుగా ప్రభాస్ నటించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా ఇలాంటి క్లాస్ పాత్రలను కూడా ప్రభాస్ చేయగలరని గతంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ మరియు డార్లింగ్ సినిమాలతో నిరూపితమైంది. అయితే బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి బాగా పెరిగింది. ఈ సమయంలో ప్రభాస్ నుండి ఇలాంటి పాత్ర వస్తుందని ఎవరూ ఊహించరు. విక్రమాదిత్య పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటించడంతో సినిమా స్థాయిని మరింత పెంచాడు. హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల నుండి మొదలుకుని పాటలు మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా ప్రభాస్ యాక్టింగ్ ప్రతిభను కనబర్చి సినిమా స్థాయిని పెంచాడు.
ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఏ విషయానికి వస్తే ఆమె ప్రేరణ పాత్రలో కనిపించింది. ప్రభాస్ కు ఏమాత్రం తగ్గకుండా యాక్టింగ్ తో పాటు అందం కూడా అదరగొట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ మాదిరిగా ఇద్దరి జోడి కుదిరింది. సినిమాలో నటించిన ఇతర నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ప్రతి పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. ఆ పాత్రలో నటించిన వారు ఆ పాత్రలకు జీవం పోసినట్లుగా నటించారు.
టెక్నికల్ వాల్యూస్ :
రాధేశ్యామ్ (Radhe Shyam Movie) ఒక భారీ బడ్జెట్ సినిమా కనుక టెక్నికల్ వాల్యూస్ సాధారణంగానే హై స్టాండర్డ్స్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే విజువల్ ఎఫెక్ట్స్ మరియు సెట్టింగ్స్. ఈ రెండూ కూడా సినిమాకు ప్రాణం పోశాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను విజువల్ వండర్ గా ఆవిష్కరించారు. అంతే కాకుండా వందకు పైగా సెట్టింగ్స్ ను నిర్మించామంటూ చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఆ భారీ తనం సినిమాలో కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అద్భుతంగా వచ్చింది.
సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కన్నుల ముందు నిజమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రతి ఒక్క ప్రేమ్ కూడా అద్భుతం అన్నట్లుగా సినిమాటోగ్రఫీ ఉంది. హీరో హీరోయిన్ల ను చూపించిన తీరు డిఫరెంట్ గా ఉంది. క్లైమాక్స్ తో పాటు ప్రతి ఒక్క సన్నివేశంలో సినిమాటోగ్రఫీ అద్భుతంగా పని చేసింది. ఇక దర్శకుడు రాధాకృష్ణ తాను చాలా కాలం క్రితం రాసుకున్న కథ అంటూ చెప్పినా కూడా ఈ తరం ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది.
సినిమా పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటలు అందించి ఆకట్టుకున్నారు. ప్రతి పాట కూడా విజువల్ వండర్ గా అనిపించింది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు గా అనిపించింది. డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ సక్సెస్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త క్రిస్పీగా ఉండి ఉంటే బావుండేది. ఇక చివరిగా నిర్మాణాత్మక విలువలు కచ్చితంగా నూటికి నూరు మార్కులు పడతాయి పడతాయి.
విశ్లేషణ :
ప్రభాస్ సినిమా అంటే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మొత్తం భారత దేశ సినీ ప్రేక్షకులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తే స్థాయికి ఆయన ఎదిగాడు. కనుక ఈ సినిమా పై సహజంగానే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ప్రభాస్ మరియు రాధా కృష్ణలు కష్టపడ్డారు అనిపించింది. సినిమా ఆలస్యం అవుతుంది అంటూ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు, కానీ ఆలస్యం కి అద్భుతమైన విజువల్ వండర్ ఆవిష్కృతం అయింది అనిపిస్తుంది. దర్శకుడు రాధాకృష్ణ కి పెద్దగా మేకింగ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అతను ప్రభాస్ స్టార్ డమ్ ని ఉపయోగించుకొని సినిమాను భారీగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాను మొదటి నుండి ఒక ప్యూర్ లవ్ స్టోరీ అంటూ చెబుతూ వస్తున్నారు.
ప్రభాస్ లవ్ స్టోరీ లో కనిపించి చాలా సంవత్సరాలు అయింది. కనక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రాధాకృష్ణ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అనిపించింది. ప్రతి ఒక్క ప్రేమ్ కూడా పెయింటింగ్ మాదిరిగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంది. ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువగానే ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోయేలా చేశారు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం లేకపోయినా కూడా ప్రేక్షకులకు ఆ లోటు లేకుండా చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. భారీ యాక్షన్ సన్నివేశాలు కానీ, కామెడీ సన్నివేశాలు కానీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేయలేదు. ప్రతి సన్నివేశాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించేందుకు సినిమాటోగ్రఫీ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ లను దర్శకుడు పూర్తిగా వినియోగించుకున్నాడు.
సంగీతం విషయంలో కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రభాస్ ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకున్నారు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ తో సినిమా ఆడేస్తుంది అన్నంతగా వారి కాంబో ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఫీల్ గుడ్ మూవీ అన్నట్లు సాగింది.. సెకండాఫ్ లో మాత్రం కాస్త సాగదీసినట్లు గా అనిపించింది. సినిమా ఓవరాల్గా మంచి నోట్ తో ఎండ్ అయ్యింది. క్లమాక్స్ గురించి మొదటి నుండి భారీగా చెబుతూ వస్తున్నారు. కాస్త అటు ఇటు అయినా కూడా ప్రేక్షకులు నిరాశ చెందే అవకాశం ఉంది కనుక బ్యాలన్స్ చేస్తూ వచ్చారు. ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా క్లైమాక్స్ ను దర్శకుడు ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్, పూజా హెగ్డే రొమాన్స్,
విజువల్ ఎఫెక్ట్స్,
భారీ సెట్టింగ్స్,
క్లైమాక్స్ ఎపిసోడ్.
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్,
కథనం సాగతీసినట్లుగా ఉంది,
కొన్ని సన్నివేశాలు రియాల్టీకి దూరంగా ఉన్నాయి.
చివరి పాయింట్..
రాధేశ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ వండర్.
రేటింగ్ : 2.75/5.0