అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టం ఓ టికెట్ రూపంలో వస్తే.. అదే లాటరీ. ఈ లాటరీ అనేది ఎక్కువగా ఆశించేవారికంటే టైమ్ పాస్‌కు కొనేవారినే ఎక్కువగా వరిస్తూ ఉంటుంది.ఈ లాటరీ అనేది ఇప్పటికీ ఎంతోమంది రిక్షావాలాలను, డ్రైవర్‌లను కోటీశ్వరులను చేసింది. తాజాగా కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిగా మార్చింది ఒక లాటరీ టికెట్.
కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్.. ఓ పెయింటర్. అతడికి రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. తాజాగా అతడు కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. అయితే ఈసారి మాత్రం తాను లాటరీ టికెట్‌ను కావాలని కొనలేదని చెప్తున్నాడు సదానందన్.ఒకరోజు తాను ఓ షాపుకు వెళ్తుండగా తన దగ్గర ఉన్న రూ. 500 నోటుకు చిల్లర కోసం ఒక లాటరీ టికెట్‌ను కొన్నాడట సదానందన్.
ఆ రోజు మధ్యాహ్నానికే రిజల్ట్స్ వచ్చాయని, అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. సదానందన్‌కు సనీష్, సంజయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాటరీలో వచ్చిన రూ. 12 కోట్లతో తాను ఒక మంచి ఇల్లు కట్టుకోవడంతో పాటు తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు సదానందన్.