Minister Roja : వైసీపీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో మళ్లీ వర్గపోరు మొదలైంది. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలు కొందరు కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే రోజా రాకుండానే పూర్తి చేశారు. దాంతో ఈ వ్యవహారంపై మంత్రి రోజా ధ్వజమెత్తారు.
కొప్పేడులో శ్రీశైలం బోర్డు చైర్మెన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో మంత్రి అయిన రోజాను ఆహ్వానించలేదు. తన నియోజకవర్గంలో తనను బలహీన పరిచే విధంగా కుట్ర చేస్తున్నారంటూ మంత్రి రోజా మండిపడ్డారు. మంత్రిగా తనకు సమాచారం ఇవ్వలేదని, భూమి పూజ చేసే విషయం కూడా తెలియదని మంత్రి రోజా మండిపడ్డారు.
Minister Roja : ఇలా సాగితే రాజకీయం చేయడం కష్టమే..
సొంత పార్టీ నేతలే ఇలా చేస్తే.. రాజకీయాలు చేయడం కష్టమని రోజా అభిప్రాయపడ్డారు. అసమ్మతి నేతల తీరును వ్యతిరేకిస్తూ రోజా తన ఆడియో మెసేజ్ విడుదల చేశారు. ఆ ఆడియో మెసేజ్‌లో మంత్రి రోజా మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇవ్వకుండా భూమి పూజ ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో బలహీన పరిచే కుట్ర జరుగుతోందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ వాళ్లు నవ్వుకునే విధంగా, వారికి సపోర్ట్ చేస్తున్నారని పార్టీలో కొందరి నేతల తీరును విమర్శించారు. తనకు నష్టం జరిగేలా పార్టీని దిగజారుస్తూ భూమి పూజ చేయడం ఎంత వరకు సమంజసమని మంత్రి రోజా ఆడియో మెసేజ్‌లో ప్రశ్నించారు.
నగరిలో జరుగుతున్న ఇలాంటి వ్యవహారాలపై పార్టీ పెద్దలు ఆలోచించాలన్నారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే తాను రాజకీయం చేయడం కష్టమని తెలిపారు. ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నామని, ప్రతి రోజూ మెంటల్ టెన్షన్ పెడుతున్నారని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పార్టీ నాయకులని చెప్పి ప్రోత్సహించడం చాలా బాధగా ఉందని రోజా బాధపడ్డారు. గతంలోనూ నగరిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఈ ఏడాది సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీల విషయంలో వివాదం వెలుగులోకి వచ్చింది. ఫ్లెక్సీల్లో రోజా ఫోటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ఇప్పుడు కూడా మంత్రి రోజాకు సమాచారం ఇవ్వకుండానే రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేయడం మరోసారి రాజకీయకంగా చర్చకు దారితీసింది.
Read Also : Baba Ramdev : బాలీవుడ్‌పై యోగా గురు సంచలన వ్యాఖ్యలు.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడన్న బాబా రామ్‌దేవ్..!