DK Aruna : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో డీకే అరుణ పర్యటించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై రాష్ట్రస్థాయి సదస్సుకు డీకే అరుణ హాజరయ్యారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారన్నారు. గతంలో వైఎస్ కుటుంబం తెలంగాణ కోసం పోరాడలేదన్నారు.

BJP Leader DK Aruna Sensational Comments on Ys Sharmila Party
తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంతకాలం.. ఆంధ్రా నుంచి వచ్చి ఎవరు పార్టీ పెట్టినా.. ఆ పార్టీని, వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరని డీకే అరుణ అన్నారు. అందుకే షర్మిల ఏపీలోనే పోటీ చేయాలన్నారు. తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించారు. 2019 ఎన్నికలలోనూ ఏపీలో షర్మిల ప్రచారం చేసినట్టు డీకే అరుణ గుర్తు చేశారు. తెలంగాణలో ఎందుకు లేరో చెప్పాలన్నారు. అలాగే ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదో కూడా షర్మిల చెప్పాల్సిన అవసరం ఉందని డీకే అరుణ ప్రశ్నించారు ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలపైనా ఆమె లేవనెత్తారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమన్నారు.
విభజన సమయంలో ముంపు మండలాలను ఏపీలో కలిపారని గుర్తు చేశారు. ఆ సమయంలో సరేనన్న కేసీఆర్.. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నారంటూ డీకే అరుణ విమర్శించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని డీకే అరుణ చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.