- జూలై 31 ఐటీఆర్ గడువు ముగిసింది
- పన్ను చెల్లింపుదారులు ఏమి చేయాలి?
- జూలై 31 తర్వాత ఐటీ రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలి
ITR Filing Last Date : టాక్స్ పేయర్లకు టెన్షన్.. టెన్షన్.. చాలా రోజులుగా సాగుతున్న పన్నుచెల్లింపుదారుల ఎదురుచూపులకు తెరపడింది. గడియారం అర్ధరాత్రి దాటింది.. జూలై 31 ముగిసింది.. కొత్త నెల ఆగస్టు 1 కూడా వచ్చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు పొడిగిస్తారని అనుకుంటే ఇంతవరకు ఎలాంటి (ITR Filing Last Date) అధికారిక ప్రకటన రాలేదు. పన్ను చెల్లింపుదారులకు నిరాశే ఎదురైంది. అయితే, ఇప్పుడు కీలక సమయం మొదలైంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR-1, ITR-2 రిటర్నులు దాఖలుకు నిర్ణయించిన డెడ్ లైన్ జూలై 31తో ముగిసింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గడువు పెంచుతారనే అందరూ అనుకున్నారు. ముఖ్యంగా టాక్స్ పేయర్లు ఎంతో ఆశగా ఎదురుచూశారు. చివరి రోజు వరకు చూసినా గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, అధికారికంగా గడువు పొడిగింపు రానిపక్షంలో ప్రకటించిన గడువే తుది గడువుగా పరిగణించాలి.
పన్ను చెల్లింపుదారులకు మరో ఛాన్స్ ఉందా? :
డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులకు మరో ఛాన్స్ ఉంటుంది. జూలై 31లోపు రిటర్న్ దాఖలు చేయలేకపోయిన పన్నుచెల్లింపుదారులు బిలేటెడ్ రిటర్న్ (ఆలస్య రిటర్న్) ద్వారా తమ ఐటీఆర్ సమర్పించవచ్చు. అయితే, సాధారణ గడువులో ఫైల్ చేసే బెనిఫిట్స్ కొన్ని కోల్పోతారు.
ఆలస్యంగా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే ఆదాయాన్ని బట్టి లేట్ ఫైలింగ్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. అంతేకాదు.. పన్ను బకాయి ఉంటే దానిపై వడ్డీ భారం కూడా భారీగా పడొచ్చు. ఆలస్యమైన ఫైలింగ్ కారణగా ట్యాక్స్ రీఫండ్ రావాల్సిన టాక్స్ పేయర్లకు కూడా ప్రాసెసింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు ఎదురుచూసిన పన్ను చెల్లింపుదారులకు మరో సవాలు ఎదురుకానుంది.
రిటర్న్ ఫైల్ చేసే ముందు AIS (Annual Information Statement), Form 26AS వివరాలను పరిశీలించకపోవడం, ఆదాయ వివరాలు సరిపోల్చుకోవడం, అవసరమైన డాక్యుమెంట్లు రెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే సరిచేసుకునే సమయం కూడా తప్పనిసరిగా ఉండాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఐటీఆర్ పొడిగింపు ఉంటుందని అనుకోవద్దని, అది సరైన నిర్ణయం అసలు కాదని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గతంలో చాలాసార్లు పొడిగించారు కదా? ఇప్పుడు కూడా అలానే పొడిగిస్తారులే అనుకోవడం పొరపాటు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్యలు కారణంగా గడువులు పొడిగించినా ప్రతి ఏడాది అదే జరుగుతుందని భావించరాదని నిపుణులు సూచిస్తున్నారు.
టాక్స్ పేయర్లు ఏం చేయాలి? :
ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయని టాక్స్ పేయర్లు ఏం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానం చాలా క్లియర్. ముందుగా పన్ను వివరాలు, ఆదాయం, పెట్టుబడులు, మినహాయింపులు, బ్యాంక్ వివరాలను మరోసారి చెక్ చేసుకోవడం బెటర్. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలస్య రిటర్న్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
డెడ్‌లైన్ పొడిగింపు కోసం వెయిట్ చేసిన టైమ్ ముగిసింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఐటీఆర్ దాఖలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఆలస్యం పెరిగే కొద్దీ ఫీజులు, వడ్డీతో పాటు అనవసరమైన ఇబ్బందులు పెరుగుతాయని గమనించాలి.
జూలై 31 డెడ్ లైన్ ముగిసింది. ఆగస్టు 1 నుంచి ఆలస్య రిటర్న్ దాఖలు చేయాల్సిందే. టాక్స్ పేయర్లు ఇప్పుడు అధికారిక నిబంధనలను ప్రకారమే తమ ఐటీఆర్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.













