...

Telangana Party : జాతీయ కాంగ్రెస్‌లోకి విలీనం కానున్న మరో పార్టీ..?

Telangana Party : జాతీయ కాంగ్రెస్‌లోకి తెలంగాణకు చెందిన మరో రాజకీయ పార్టీ విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో మెగాస్టార్ స్థాపించిన ‘ప్రజారాజ్యం పార్టీ’ కేవలం నాలుగు నుంచి ఐదేళ్లలోపే కాంగ్రెస్‌లో పార్టీలో విలీనం అయిన విషయం తెలిసిందే. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా18 స్థానాల్లో గెలుపొందారు.

ఆ తర్వాత, అనతి కాలంలోనే పార్టీని నడపలేక సోనియాగాంధీతో చర్చల అనంతరం చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియాకు ప్రామిస్ చేసిన కేసీఆర్ మాట తప్పారు. తీరా రాష్ట్రం సాధించిన ఉద్యమ నేతగా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. అప్పటినుంచి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

తాజాగా కాంగ్రెస్‌లో మరో పార్టీ చేరనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్ స్థాపించిన ‘తెలంగాణ ఇంటి పార్టీ’ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కానున్నట్టు సమాచారం. పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన సతీమణి లక్ష్మీ, కుమారుడు సుహాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఏఐసీసీ సీనియర్ లీడర్ కొప్పుల రాజు రెండు పార్టీలకు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 14న నల్గొండలో భారీ ఎత్తున సభ నిర్వహించి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా, చెరుకు సుధాకర్‌కు నకిరేకల్ నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. డాక్టర్‌గా ఆయనకు హైదరాబాద్, నల్గొండలో మంచిపేరు సంపాదించుకున్నారు.

ఉద్యమ సమయంలో నాటి ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల వలన ఏడు నెలలు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి సీఎం కేసీఆర్‌తో అభిప్రాయ భేదాలు వచ్చాక బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీ స్థాపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ల సలహాల మేరకు విలీనం చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ మీద గెలుపొందాలని చెరుకు సుధాకర్ భావిస్తుస్నట్టు తెలుస్తో్ంది.

Read Also : TDP CM Candidates : టీడీపీలో నయా లీడర్లు.. సీఎం అభ్యర్థులు వీళ్లే..?