Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాలు ప్రారంభం నుంచే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా పథకం కింద కూడా పంట పెట్టుబడి సాయంగా ఎకరం వరకు సాగు చేసే భూములకు ఫిబ్రవరి 5న నిధులు విడుదలయ్యాయి.
రాష్ట్రంలో మెుత్తంగా 17.03 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముందుగా తొలి విడతలో భాగంగా 563 గ్రామాల్లోనే రైతుభరోసా డబ్బులు విడుదల చేశామన్నారు. రెండో విడత కింద తెలంగాణలోని ఎకరం సాగు భూములు కలిగిన రైతులకు రూ.6 వేల చొప్పున డబ్బులు విడుదల చేసినట్టు చెప్పారు. నల్గొండ జిల్లాలోని 1.55 లక్షల మంది రైతులకు, సిద్దిపేట జిల్లాలో 1.20 లక్షల రైతులకు, మెదక్ జిల్లాలో 1.15 లక్షల రైతులకు, సంగారెడ్డి జిల్లాలో 1.15 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడ్డాయని చెప్పారు.
Rythu Bharosa : ప్రతి సాగు ఎకారాకు రైతు భరోసా అందుతుంది :
ఇప్పటికీ అనేక మంది తెలంగాణ రైతులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ నుంచి ముఖ్యమైన ప్రకటన వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే.. రైతుభరోసాను పెట్టుబడి సాయంగా నిధులను రైతులకు నిర్ణీత కాలవ్యవధిలో చెల్లించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఎకరం వరకు మాత్రమే డబ్బులు విడుదల చేసినట్టు పేర్కొంది. మిగిలిన రైతులందరికి అతి త్వరలోనే విడుదల చేయనుంది. రైతులు తమ రైతుభరోసా డబ్బుల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సాగులోని ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రైతు భరోసాకు సంబంధించి పంట పెట్టుబడికి గత జనవరి 27వ తేదీ నుంచి ఇప్పటివరకు 21,45,330 మంది రైతులకు రూ.1,126 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత బుధవారం రోజునే ఎకరం సాగు చేస్తున్న 17.03 లక్షల రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.6 వేల చొప్పున డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అతి త్వరలోనే మరో 2 నుంచి 3 ఎకరాల రైతులకు కూడా వచ్చే సాగులో ప్రతి ఎకరాకు డబ్బులు పడనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, ఆన్‌గోయింగ్ స్కీమ్ కావడంతో ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని సమాచారం.