Ration cards: కరోనా లాక్ డౌన్ సమయంలో కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని తీసుకువచ్చింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత రేషన్ స్కీమ్ ను అమలు చేసింది. 5 కిలోల బియ్యాన్ని ఇస్తోంది. 2022 మార్చిలో ఈ పథకాన్ని మరో 6 నెలలు పొడిగించింది. సెప్టెంబర్ వరకు ఉచితంగా రేషన్ ఇవ్వనుంది కేంద్ర సర్కారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ కు ఇది అదనం.
అయితే ఉచితంగా రేషన్ ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాకు గండి పడుతోందని ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. సెప్టెంబరు నెలలో ఎట్టిపరిస్థితుల్లో నిలిపివేయాలని సూచనలు చేసింది. అలాగే పెరిగిన పన్నులనూ తగ్గించే ఆలోచన మానుకోవాలని చెప్పింది. ధరలు తగ్గిస్తే ఖజానాపై భారం పడుతుందని వెల్లడించింది.
మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోయింది. ఉప్పులు, పప్పులు అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజలపై ధరల భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. సామాన్యుల జీవితాలపై భారీ ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ధరలు తగ్గించేందుకు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ధరల పెరుగుదల ఏమాత్రం ఆగడం లేదు. సైలెంట్ గా ఒక్కొక్కటి పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉన్న ధరలు ఈరోజు ఉండటం లేదు. ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉంటాయన్న గ్యారెంటీ లేదు.