...

CM KCR Delhi Tour : ఢిల్లీకి వెళ్లి అమీతుమీ తేల్చుకుని వస్తానన్న కేసీఆర్.. ఏం సాధించారు?

CM KCR Delhi Tour : యాసంగిలో వరి వేయాలా వద్దా..? వర్షాకాలం వరి ధాన్యాన్ని కేంద్రం కొంటుందా కొనదా..? కేంద్రంతో అమీతుమీ తేల్చుకుని వస్తానని బయలు దేరిన కేసీఆర్ ఢిల్లీ టూర్ పర్యటన ముగిసింది. నిన్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఈనెల 21న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో వెళ్లిన కేసీఆర్ ఈ నాలుగు రోజుల పర్యటనలో ఏం సాధించారు.

తెలంగాణ రైతులకు ఏం శుభవార్త తెచ్చారు. ధాన్యం కేంద్రం కొంటానని చెప్పిందా..? కొనను అని చెప్పిందా.? అసలు ఏమైంది ఈ విషయాలను దాచి కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ పర్యటన తుస్సుమందని, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్  కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేస్తున్నారు.

ఢిల్లీ పర్యటనకు ముందు రైతుల కోసం రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక మనకు ధర్నా చౌక్‌తో మనకు పనిలేదని, స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రంలో పాలన జరుగుతుందని చెప్పి దానిని ఎత్తివేయించారు. తీరా నిరుద్యోగులు, ప్రజాసంఘాల నేతలు హైకోర్టులో కేసు వేసి ధర్నా చౌక్ తెరిపించారు. ఆందోళనలు వద్దన్న పెద్ద రైతు కేసీఆర్.. రైతుల కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కూర్చోవడంతో ప్రతిపక్షాలే కాదు, రాష్ట్ర ప్రజానీకం కూడా షాక్ అయ్యింది. రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసి చనిపోయిన 700 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇకపోతే ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం కేసీఆర్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పీయూష్ గోయల్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో కేసీఆర్ చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. అయితే, హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం, బీజేపీతో యుద్దం చేస్తానని ప్రకటించడం వల్లే కేంద్రం ఆయనకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కావాలనే కేసీఆర్‌ను దూరం పెట్టారని తెలిసింది. హస్తినకు వెళ్లి రైతుల కోసం కేసీఆర్ సాధించింది ఏమీ లేదని.. కొండను ఢీకొట్టిన పొట్టేలు వలే విలవిలలాడుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Komati Reddy Brothers : కాంగ్రెస్‌లో వీహెచ్ రాయబారం.. కోమటి బ్రదర్స్ దారికొస్తరా?