...

Huzurabad By-election : కేసీఆర్ నిజంగా భయపడ్డారా..? ఈ అతిజాగ్రత్తకు కారణమేంటి..? ఆయన వ్యూహామేంటి?

Huzurabad By-election : హుజురాబాద్‌లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గులాబీ బాస్ వివిధ రకాల స్కెచ్‌లు వేస్తున్నా, అవి వర్కౌట్ అయ్యేలా కనిపించకపోవడంతో కేసీఆర్ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్వసనీయ రాజకీయ వర్గాల సమాచారం. ఈనెల 30న ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనిని టీఆర్ఎస్‌ పార్టీ లైఫ్ అండ్ డెత్‌గా తీసుకుంటున్నట్టు తెలిసింది.

ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గంలోనే ప్రచార బిజీలో మునిగిపోయారు. అయినప్పటికీ నేరుగా గులాబీ బాస్ రంగంలోకి దిగుతుండటంతో హుజురాబాద్ బై పోల్ కోసం స్వయంగా ముఖ్యమంత్రే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరమా? ఇది దేనికి సంకేతం, కేసీఆర్ నిజంగానే భయపడుతున్నారా..? లేదా ప్రత్యర్థులను తిప్పికొట్టేందుకు ఆయన ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ముందుగా హన్మకొండలోని పెంచికల్ పేటలో ఈనెల 27న కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ, ఎన్నికల కోడ్ అడ్డం వస్తుందని ఆగిపోయారని తెలిసింది. ఆ తర్వాత బహిరంగ సభను హుస్నాబాద్‌లో పెట్టుకుందామా లేక నియోజకవర్గంలోనే రెండ్రోజులు వరుసగా రోడ్డు షోలు నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా మారిపోయారు. ఈటలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నట్టు, తాయిలాలు ప్రకటిస్తున్నట్టు ఓ వైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునా ఆరోపిస్తున్నాయి. అందుకే హుజురాబాద్ ఎన్నికలను చరిత్రలోనే ఖరీదైన ఎన్నికగా చెప్పుకుంటున్నారు.

రోడ్ షోలు, బహిరంగసభల సంగతి పక్కన పెడితే హుజురాబాద్ ఉపఎన్నికల టార్గెట్‌గా కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. సరిగ్గా పంపిణీ సమయంలో ఈసీ ఆదేశాల మేరకు దానిని ఆపేశారు. బీజేపీ ఫిర్యాదు చేయడం వల్లే పథకం ఆగిపోయిందని ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. వాళ్లుకూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు.

మీకు ఇవ్వడం ఇష్టం లేకనే తమ మీద నిందలు వేస్తున్నారని బీజేపీ గట్టిగా బదులిస్తోంది. అయితే, తాను రాజీనామా చేయడం వల్లే దళితబంధు పథకం వచ్చిందని ఈటల అదేపనిగా ప్రచారం చేస్తుండటం టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.

మరోవైపు ఓ సీక్రెట్ సర్వేలో గెలుపు అవకాశాలు ఈటలకే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అందుకోసమే సీఎం కేసీఆర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టి అధికార పార్టీ ఉపఎన్నికలో ఎలా చక్రం తిప్పనుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also : Pawan Kalyan : బద్వేలు ఉపఎన్నికపై పవన్ మౌనం.. బీజేపీలో టెన్షన్ టెన్షన్