కన్నడ సూపర్ స్టార్, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ కు, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్ కు మధ్య ట్విట్టర్ లో వార్ నడుస్తోంది. భాషా ప్రాధాన్యం, జాతీయ భాష మధ్య ఇద్దరు సూపర్ స్టార్ లు మాటామాట అనుకుంటున్నారు. ఇటీవల దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా వ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో పలువురు సెలబ్రిటీలు దానిపై స్పందించిన విషయం తెలిసిందే. కన్నడ మూవీ కేజీఎఫ్ ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. దీనిపై స్పందిస్తూ కిచ్చా సుదీప్ పలు వ్యాఖ్యలు చేశారు.
కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తోందని అంటున్నారు కానీ… అందులో ఏమాత్రం నిజం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను అలరించేలా మనం చిత్రాలు తెరకెక్కిస్తున్నాం. హిందీ వారే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారు. తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా చాలా హిందీ సినిమాలు విజయాలను అందుకోవట్లేదు అని సుదీప్ అన్నారు.
కిచ్చా సుదీప్ వ్యాఖ్యలపై అజయ్ దేవ్ గణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సోదరా.. నీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ చిత్రాలను హిందీలో డబ్ చేస్తున్నారు.. జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుండో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది. జనగణ మన. అని అజయ్ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ పై నెట్టింట చర్చ సాగుతోంది. కొందరు అజయ్ దేవ్ గణ్ స్పందనపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇది ఇలా నడుస్తుండగానే.. అజయ్ ట్వీట్ పై కిచ్చా సుదీప్ స్పందించాడు. అజయ్ సర్.. నేనొక రకంగా చెబితే మీకు మరోలా అర్థమైందనుకుంటా. నేను ఎవరినీ కించపరిచేందుకు అలా చేయలేదు. మన దేశ భాషలన్నింటిపైనా నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. మేం హిందీని ప్రేమించాం, గౌరవించాం, నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో పెట్టిన ట్వీట్ ను నేను చదవగలిగా.
అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థిత ఏమిటి సర్.. చదవగలరా. అనువాదానికి, ఊహించుకోవడానికి చాలా తేడా ఉంది. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుంది. నేను మిమ్మల్ని నిందించడం లేదు. మీ నుండి రిప్లై వచ్చినందుకు సంతోషిస్తున్నా. ఇంతటితో ఈ టాపిక్ ను ముగిద్దాం. త్వరలోనే మనం కలవాలని కోరుకుంటున్నా. అని సుదీప్ వరుస ట్వీట్లు చేశారు.